BIG Breaking : జమ్మూకాశ్మీర్‌లో 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

జమ్మూకాశ్మీర్‌లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.

Update: 2024-08-26 23:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్‌లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ (INC) అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ(NCP) కలిసి పోటీ చేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించాయి. రెండు పార్టీల మధ్య కుదిరిన సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 51 స్థానాల్లో అలాగే కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. మిగిలిన 5 స్థానాల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయనుండగా, సీపీఐ(ఎం), పాంథర్స్‌ పార్టీకి ఒక్కో సీటును కేటాయించారు. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.కాగా జమ్మూకాశ్మీర్‌లో మొత్తం 88.06 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం అర్థరాత్రి ప్రకటించారు. మిత్రపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ (NCP)తో కాంగ్రెస్ సీట్ల షేరింగ్ డీల్ కుదుర్చుకున్న తర్వాత ఈ ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ నాయకులు గులామ్ అహ్మద్ మీర్, డూరు నుండి, బనిహాల్ నుండి వికార్ రసూల్ వనీ, ముఖ్యమైన అనంతనాగ్ నియోజకవర్గం నుండి పీర్జాదా మొహమ్మద్ సయ్యద్ పోటీ చేయనుండగా, షేక్ రియాజ్ దోడా నుంచి పోటీ చేయబోతున్నారు. అలాగే ట్రాల్ స్థానం నుంచి సురీందర్ సింగ్ చన్నీ, దేవ్‌సర్ నుంచి అమానుల్లా మంటూ, ఇందర్వాల్ నుంచి షేక్ జఫరుల్లా, భదర్వా నుంచి నదీమ్ షరీఫ్, దోడా వెస్ట్ నుంచి ప్రదీప్ కుమార్ భగత్‌లను పార్టీ బరిలోకి దించింది.


Similar News