సుప్రీంకోర్టులో ఢిల్లీ సర్కారుకు ఎదురుదెబ్బ
సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD) సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ కు ఉందని స్పష్టం చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD) సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ కు ఉందని స్పష్టం చేసింది. ఎంసీడీలో 10 మంది సభ్యుల్ని మంత్రి మండలి సలహా మేరకు నామినేట్ చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది. అయితే, ఎంసీడీ నామినేషన్ విషయంలో ఎల్జీకి స్థానిక ప్రభుత్వం సలహా అవసరం లేదంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ నుంచి ఈ అధికారం వచ్చిందని వెల్లడించింది. కాబట్టి ఎల్జీ స్థానిక ప్రభుత్వ సలహాను పాటించాల్సిన అవసరం లేదంది. ఎల్జీకి చట్టం ప్రకారమే ఆ అధికారం లభించిందని వ్యాఖ్యానించింది. 2022 డిసెంబర్‌లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ గెలిచింది. మొత్తం 250 వార్డుల్లో.. 134 స్థానాల్లో విజయం సాధించింది. అయితే.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన 10 మంది నామినేటెడ్ కౌన్సిలర్లతో ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టును ఆప్ ఆశ్రయించగా.. ఈ తీర్పు వెలువడింది.
సుప్రీం తీర్పుని ఖండించిన ఆప్..
ఢిల్లీ గవర్నర్ అధికారాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఆప్ ఖండించింది. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఈ తీర్పు మంచిది కాదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. “ఈ తీర్పు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి మంచిది కాదని భావిస్తున్నా. మేం ఈ నిర్ణయంతో పూర్తిగా విభేదిస్తున్నాం. ఈ నిర్ణయం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. పూర్తి ఉత్తర్వును చదివిన తర్వాత తదుపరి ఏం చేయాలనే దానిపై వ్యూహం రూపొందిస్తాం’’ అని అన్నారు. ఆప్ వ్యవహారంపై ఢిల్లీ బీజేపీ స్పందించారు. ఎల్జీ చేసే ఏపనినైనా ప్రశ్నించడం ఆప్ కు అలవాటుగా మారిందన్నారు. కేజ్రీవాల్ పార్టీ అరాచక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా అన్నారు.