సెక్స్ స్కాండల్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆరు రోజుల పోలీస్ కస్టడీకి MP ప్రజ్వల్ రేవణ్ణ
మహిళలపై లైంగిక వేధింపులు, ఆశ్లీల వీడియోల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, హసన్ లోక్ సభ
దిశ, వెబ్‌డెస్క్: మహిళలపై లైంగిక వేధింపులు, ఆశ్లీల వీడియోల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, హసన్ లోక్ సభ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ బెంగళూరు సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, మహిళలపై లైంగిక వేధింపులు, ఆశ్లీల వీడియోల వ్యవహారంలో ఎంపీ ప్రజల్వ్ రేవణ్ణపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి దేశం విడిచి పారిపోయిన రేవణ్ణ ఇవాళ జర్మనీ నుండి బెంగుళూరులోని కెంపెగౌడ ఎయిర్ పోర్టుకు రాగానే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ప్రజ్వల్ రేవణ్ణకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసు చాలా తీవ్రమైనదని.. కేసుకు సంబంధించి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్న నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థాన్నాన్ని కోరారు. పోలీసుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న బెంగుళూరు సెషన్స్ కోర్టు ప్రజ్వల్ రేవణ్ణను ఆరు రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. ఈ కేసు కర్నాటకతో పాటు దేశ రాజకీయాల్లో సంచలనం రేపడంతో పోలీసుల కస్టడీలో ఎలాంటి విషయాలు బయట పడుతాయోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.