రాహుల్‌గాంధీని మందలించిన ఈసీ.. ఎందుకు ?
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కేంద్ర ఎన్నికల సంఘం సుతిమెత్తగా మందలించింది.
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కేంద్ర ఎన్నికల సంఘం సుతిమెత్తగా మందలించింది. ప్రసంగాల్లో నోటికొచ్చినట్టుగా మాట్లాడొద్దని.. మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించింది. గతేడాది ప్రధానమంత్రి నరేంద్రమోడీని అపశకునం(పనౌతీ), జేబుదొంగ అని రాహుల్ పిలవడానికి వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్‌లో రాహుల్‌పై చర్య తీసుకోవాలని ఈసీని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతోనే రాహుల్‌కు ఈసీ గత వారంలో అడ్వయిజరీ జారీ చేసింది. బహిరంగ ప్రసంగాల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాజకీయ నాయకుల ఎన్నికల ప్రసంగాలు హద్దు మీరుతుండటాన్ని గుర్తించిన ఈసీఐ.. గత వారంలో వివిధ రాజకీయ పార్టీలకు కూడా కీలకమైన సూచనలు చేసింది. ప్రసంగించేటప్పుడు సంయమనం పాటించాలని ఆయా పార్టీల నాయకులను కోరింది. 2019 ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ ఇంటిపేరును ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆయన్ను చిక్కుల్లో పడేశాయి. ఈ వ్యాఖ్యలతో పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయే ముప్పును ఆయన ఎదుర్కొన్నారు. కింది కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్దారించి, జైలు శిక్షను ఖరారు చేయగా.. జిల్లా కోర్టు, హైకోర్టులు కూడా ఆ తీర్పునే సమర్ధించాయి. ఎట్టకేలకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభించింది. దీంతో మళ్లీ పార్లమెంటు సభ్యుడయ్యారు.