Bangladesh : ‘బంగ్లా’లో కల్లోలం.. భారత్‌కు ‘ఉగ్ర’ గండం

దిశ, నేషనల్ బ్యూరో : ప్రస్తుతం బంగ్లాదేశ్‌ను అల్లకల్లోలం చేస్తున్న హింసాకాండ వల్ల పొరుగునే ఉన్న భారత్‌కు ఉగ్రవాద సంస్థల ముప్పు పెరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

Update: 2024-08-12 12:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ప్రస్తుతం బంగ్లాదేశ్‌ను అల్లకల్లోలం చేస్తున్న హింసాకాండ వల్ల పొరుగునే ఉన్న భారత్‌కు ఉగ్రవాద సంస్థల ముప్పు పెరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు విద్యార్థి సంఘాలు సారథ్యం వహించినప్పటికీ.. తాజాగా అక్కడి మైనారిటీ హిందువులపై జరిగిన దాడుల వెనుక ఉగ్రవాద సంస్థలే ఉన్నాయని అనుమానిస్తున్నారు. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తైబాతో బంగ్లాదేశ్‌కు చెందిన అన్సారుల్లా బంగ్లా టీమ్(ఏబీటీ) కలిసి భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు పాల్పడే ముప్పు ఉందని నిఘా వర్గాలు అంటున్నాయి. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ మార్పిడిని కోరుతూ నిరసనలు జరిగిన సమయంలో జమాతే ఇస్లామీ, అన్సారుల్లా బంగ్లా టీమ్, ఇతర నిషేధిత గ్రూపులకు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ సహాయ సహకారాలను అందించిందని తెలుస్తోంది.

త్రిపురలో దాడులకు కుట్ర భగ్నం

2022 సంవత్సరం నుంచే లష్కరే తైబాతో ఏబీటీ ఉగ్రసంస్థ కలిసి పనిచేస్తున్న విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. బెంగాల్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ భారత్‌లో దాడులు చేయాలనేది అప్పట్లో ఆ రెండు ఉగ్ర సంస్థల ప్లాన్‌‌గా ఉండేదని భారత నిఘా విభాగాలు చెబుతున్నాయి. 2022లో త్రిపురలోని ఓ వర్గానికి చెందిన ప్రార్థనా మందిరాలపై దాడులు జరిగాయి. ఆ సమయంలో మరో వర్గానికి చెందిన ప్రార్థనాలయాలపై దాడులు చేసే ఉద్దేశంతో బంగ్లాదేశ్ నుంచి త్రిపురలోకి చొరబడేందుకు దాదాపు 50 నుంచి 100 మంది ఏబీటీ ఉగ్రవాదులు ప్లాన్ చేశారని నిఘా వర్గాలు గుర్తుచేశాయి. దీనిపై భారత్‌కు ముందస్తు సమాచారం అందడంతో ఆ ఉగ్రవాదులు అసోంలోకి ప్రవేశించగానే అరెస్టు చేశారు.

తొమ్మిది ఉగ్రవాద సంస్థలు యాక్టివ్

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో తొమ్మిది ఉగ్రవాద సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయి. ఆ జాబితాలో అన్సారుల్లా బంగ్లా టీమ్‌తో పాటు అన్సార్ అల్ ఇస్లామ్, లష్కరే తైబా, హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ బంగ్లాదేశ్, జాగ్రత ముస్లిం జనతాా బంగ్లాదేశ్, జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్, పుర్బా బంగ్లార్ కమ్యూనిస్ట్ పార్టీ, ఇస్లామీ ఛత్ర శిబిర్, ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉన్నాయి. షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఈ ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపారు. ఆ దేశ భావి ప్రభుత్వాలు ఉగ్రవాద సంస్థలపై ఎలాంటి వైఖరిని తీసుకుంటాయో వేచిచూడాలి.

Tags:    

Similar News