Bangladesh unrest:భారత్ లోకి చొరబడేందుకు యత్నించిన 600 మంది బంగ్లాదేశీయులు

హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్ అట్టడుకుతోంది. రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఇలాంటి టైంలో భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు బంగ్లాదేశీయులు యత్నిస్తున్నారు.

Update: 2024-08-08 05:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్ అట్టడుకుతోంది. రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఇలాంటి టైంలో భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు బంగ్లాదేశీయులు యత్నిస్తున్నారు. సుమారు 600 మంది దేశ భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వందలాది బంగ్లాదేశ్‌ పౌరులు దేశం విడిచి పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలోని దక్షిణ్ బెరుబరి గ్రామం నుంచి భారత్‌లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించారు. వారిని బీఎస్‌ఎఫ్‌ భద్రతా బలగాలు నిలిపివేశాయి. బలవంతంగా భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే కాల్పులు జరపాల్సి వస్తుందని హెచ్చరించాయి.

భారత్- బంగ్లా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు

మంగళవారం రాత్రి అవామీ లీగ్ మాజీ ఎంపీ కమరుల్ అరేఫిన్, అతని కుటుంబంతో కలిసి పెట్రాపోల్-బెనాపోల్ సరిహద్దు క్రాసింగ్‌ వద్ద భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. వీసా లేనందున వారిని ఆపే ప్రయత్నంలో పరిస్థితి ఉద్రిక్తమైంది. బీఎస్ఎఫ్ దళాలు వారిని తిరిగి బంగ్లాదేశ్ కు పంపారు. అక్కడ బంగ్లా సైన్యం వారిని అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ సరిహద్దుల్లో 200 నుంచి 500 మీటర్ల మధ్య భారత్ లోకి ప్రవేశించేందుకు బంగ్లా ప్రజలు వేచిచూస్తున్నట్లు బీఎస్ఎఫ్ నార్త్ బెంగాల్ ఫ్రాంటియర్ డీఐజీ అమిత్ కుమార్ త్యాగి తెలిపారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు బంగ్లా సైనికాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, ఒడిశా తీరంలోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. చిన్న బోట్ల ద్వారా బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్ లోకి ప్రవేశించే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. 480 కిలోమీటర్ల తీర ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అల్లర్ల సమయంలో బంగ్లాదేశ్ జైళ్ల నుంచి కొందరు నేరస్థులు బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు.

మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు

బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వీడారు. దీంతో, సైన్యం నేతృత్వంలో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్‌ గ్రహీత మహ్మద్‌ యూనుస్‌ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే విషయాన్ని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకారుజ్జమాన్‌ ప్రకటన చేశారు. అయినప్పటికీ అక్కడి విధ్వంసకర పరిస్థితులు అదుపులోకి రాలేదు. షేక్‌ హసీనా పార్టీ అవామీ లీగ్‌ మద్దతుదారుల్ని దారుణంగా హత మార్చుతున్నారు. అలా ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌లో 470 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. హింసాత్మక ఘటనలు ఆపేందుకు పోలీసులు తిరిగి విధుల్లోకి రావాలని, పరిస్థితుల్ని చక్కదిద్దాలని ఆ దేశ పోలీస్‌ తాత్కాలిక చీఫ్‌ షహీదుర్‌ రెహా్మన్‌ బహిరంగంగా విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది. ఆర్మీ సైతం చేతులెత్తేసింది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు కారణమైన విద్యార్ధులే రంగంలోకి దిగారు. పరిస్థితుల్ని చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.


Similar News