Pakistan: పాకిస్థాన్ ను కలవరపెడుతున్న అంతర్గత పోరు
పాకిస్థాన్ ను అంతర్గత పోరు కలవరపెడుతోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులకు పాల్పడుతోంది. రైలు హైజాక్ ఘటన మర్చిపోకముందే మరో దాడికి పాల్పడింది.
దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ ను అంతర్గత పోరు కలవరపెడుతోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులకు పాల్పడుతోంది. రైలు హైజాక్ ఘటన మర్చిపోకముందే మరో దాడికి పాల్పడింది. నోష్కిలో సైనికులు ప్రయాణిస్తున్న మిలటరీ కాన్వాయ్‌పై ఆదివారం బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, 21 మంది గాయపడ్డారు. క్వెట్వా నుంచి తఫ్తాన్ వెళ్తుండగా ఈ బాంబు దాడి జరిగింది. ఈ దాడికి తామే బాధ్యులమని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. అయితే, ఆర్మీ కాన్వాయ్‌పై జరిపిన దాడిలో 90 మంది సైనికుల హతమైనట్టు వెల్లడించింది. మరిన్ని వివరాలు తరువాత వెల్లడిస్తామని తెలిపింది.
కాన్వాయ్ పై దాడి..
కాగా, క్వెట్టా నుంచి తఫ్తాన్‌కు భద్రతా బలగాల కాన్వాయ్ వెళ్తుండగా దాడి జరిగినట్టు పాక్ అధికారులు తెలిపారు. కాన్వాయ్‌లో ఏడు బస్సులు ఉండగా, రెండిటిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్టు చెప్పారు. ఒక బస్సును ఐఈడీ ఉంచిన వాహనం ఢీకొందని తెలిపారు. అయితే, అది ఆత్మాహుతి దాడి కావచ్చని, మరో బస్సును వార్‌హెడ్‌తో కూడిన రాకెట్‌తో ఢీకొట్టిందని అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలికి ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్లు చేరుకోవడంతో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని అధికారులు పేర్కొన్నారు. బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫ్రాజ్ బుగ్టి దాడిని ఖండించారు. సైనికుల మరణాలపై విచారం వ్యక్తం చేశారు. మరోవైపు, పాకిస్థాన్‌లో ఇంధన, ఖనిజ సంపదపరంగా అతిపెద్దదిగా, జనాభాపరంగా అతిచిన్న ప్రావిన్స్‌గా బెలూచిస్థాన్ ఉంది. కేంద్ర ప్రభుత్వం తమ పట్ల వివక్ష చూపుతోందని బలూచ్ వాసులు ఆరోపిస్తున్నారు. అయితే, ఇస్లామాబాద్ మాత్రం ఆ వాదనను కొట్టివేస్తోంది. పాకిస్థాన్ నుంచి తమకు ఇండిపెండెన్స్ కావాలని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటు బావుటా ఎగురవేస్తోంది.