Badlapur: బద్లాపూర్ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు నిందితులకు ముందస్తు బెయిల్ నిరాకరణ

మహారాష్ట్ర థానే జిల్లాలోని బద్లాపూర్‌లో ఓ పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే.

Update: 2024-10-01 12:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర థానే జిల్లాలోని బద్లాపూర్‌లో ఓ పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇద్దరు నిందితులకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. పాఠశాల చైర్మన్, సెక్రటరీకి బెయిల్ ఇవ్వడం కుదరదని తెలిపింది. వీరిద్దరికీ ఘటన గురించి ముందే తెలుసునని, అయితే పోలీసులకు, స్థానిక అధికార యంత్రాంగానికి ఈ విషయాన్ని తెలియజేసి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని జస్టిస్ ఆర్‌ఎన్ లడ్డాతో కూడిన బెంచ్ పేర్కొంది. బాధితులు మైనర్లని, వారు అనుభవించిన గాయం భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది.

లైంగిక వేధింపుల కేసు నమోదులో జాప్యం జరిగిందని, ఇందులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. ఘటన జరిగిన రోజు నుంచి పాఠశాల ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీ కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. కాగా, మహారాష్ట్రలోని బద్లాపూర్ పట్టణంలోని పాఠశాల వాష్‌రూమ్‌లో నాలుగేళ్ల వయస్సు గల ఇద్దరు బాలికలపై అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అనంతరం ప్రధాన నిందితుడు అక్షయ్ షిండేను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాజాగా జరిగిన పోలీసులు కాల్పుల్లో ఆయన మరణించాడు. మరోవైపు, ఎన్‌కౌంటర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిందితుడు అక్షయ్ షిండే తండ్రి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


Similar News