అయోధ్యలో తొలి శ్రీరామనవమి వేడుకలు.. ఇవే రూల్స్..!

అయోధ్యలో తొలిసారిగా శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల కోసం ఇప్పటికే అయోధ్య అంతా ముస్తాబయ్యింది.

Update: 2024-04-16 16:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో తొలిసారిగా శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల కోసం ఇప్పటికే అయోధ్య అంతా ముస్తాబయ్యింది. భక్తుల దర్శనం కోసం శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాటు పూర్తి చేసింది. ఇప్పటికే దర్శనం, హారతి సమయానికి సంబంధించిన వివరాలు తెలిపింది. శ్రీరామనవమి పర్వదినాన వీఐపీ ప్రత్యేక దర్శనాలు నిషేధించారు. ఈనెల20 నుంచి మళ్లీ వీఐపీ పాసులు అందుబాటులోకి రానున్నాయి.

అయోధ్యలో దర్శన సమయం

శ్రీరామనవమి రోజున భక్తులకు శ్రీరాముడి దర్శనం కోసం 19 గంటల పాటు ఆలయం తలుపులు తెరిచి ఉంచుతారు. భక్తుల కోసం తెల్లవారుజామున 3.30 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలకు అనుమతి ఇచ్చారు. నాలుగు భోగ నైవేద్యాల సమయాల్లో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే తెర మూసివేయనున్నారు. విశిష్ట అతిథులు ఏప్రిల్ 19 తర్వాత మాత్రమే దర్శనం కోసం సందర్శించాలని అయోధ్య రామ మందిర ట్రస్ట్ వెల్లడించింది. ఉదయం 3.30గంటలకు మంగళ హారతి ఇవ్వనున్నారు. అప్పటి నుంచి రాత్రి 11 గంటల వరకు బాలరాముడిని దర్శించుకోవచ్చు. శయన హారతి అనంతరం మందిర్ నిష్క్రమణ దగ్గర ప్రసాదం పంపిణీ చేస్తారు.

వీఐపీ దర్శనాలు రద్దు

శ్రీరామనవమి రోజు లక్షలాది మంది భక్తులు బాలరాముడ్ని దర్శించుకునేందుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ దర్శనాలను నిలిపివేసింది. ఈనెల 18 వరకు ఆన్ లైన్ లో ఇచ్చే పాసులను రద్దు చేసింది. తిరిగి ఈనెల 19న వీఐపీ దర్శనాలు చేసుకోవచ్చని తెలిపింది. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 18 వరకు దర్శనం, ఆరతి మొదలైన వాటి కోసం అన్ని ప్రత్యేక పాస్ బుకింగ్‌లు ఇప్పటికే రద్దు చేసినట్లుత తెలిపింది. అందరికీ ఒకటే క్యూ ఉంటుందని రామమందిర ట్రస్ట్ తెలిపింది. శయన హారతి తర్వత మందిర్ నిష్క్రమణ దగ్గర ప్రసాదం పంపిణీ చేస్తారని ప్రకటించింది.

మొబైల్ పోన్ల గురించి..

మొబైల్ ఫోన్లను లాకర్ల దగ్గర డిపాజిట్ చేసే సమయం వృథా చేయడం కన్నా.. దర్శనానికి ముందే తమ సురక్షిత ప్రాంతాల్లో పెట్టుకోవాలని సూచించింది. క్యూలోకి రాకముందే మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులు, ఆలయ ఆవరణలో ఉన్న సురక్షిత ప్రాంతాల్లో డిపాజిట్ చేయాలని సూచించారు. ఫోన్లు, షూలు, చెపప్లు, బ్యాగులు, ఇతర వస్తువులు దర్శనానికన్నా ముందే సురక్షిత ప్రాంతాల్లో డిపాజిట్ చేయాలని సూచించారు.

అయోధ్య నగరవ్యాప్తంగా పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై శ్రీరామ జన్మోత్సవ వేడుకలు ప్రసారం కానున్నాయి. రామమందిర ట్రస్ట్ సోషల్ మీడియా అకౌంట్లలోనూ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.


Similar News