ట్రంపుపై దాడి..సొంత పార్టీ వ్యక్తే నిందితుడు!

అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆ దేశ మాజీ ప్రెసిడెంట్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంపుపై హత్యాయత్నం జరిగింది.

Update: 2024-07-14 14:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆ దేశ మాజీ ప్రెసిడెంట్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంపుపై హత్యాయత్నం జరిగింది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతుండగా..ఆయనపై ఓ దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవికి బుల్లెట్ తగిలి గాయమైంది. అలాగే ఈ కాల్పుల్లో ఓ సాధారణ పౌరుడు మరణించగా..మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంపును చుట్టుముట్టి సురక్షితంగా వేదికపై నుంచి కిందకు దించారు. అనంతరం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. దాదాపు 400 అడుగుల దూరంలో ఉన్న ఓ భవనం పైకప్పు నుంచి ట్రంప్‌ను కాల్చినట్టు పెన్సిల్వేనియా పోలీసులు తెలిపారు. ఏఆర్ 15 రైఫిల్‌తో మొత్తం 8 రౌండ్లు కాల్పులు జరపగా..తొలి రౌండ్‌లో 3 బుల్లెట్లు, రెండో రౌండ్‌లో 5 బుల్లెట్లు దూసుకెళ్లినట్టు పేర్కొన్నారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6.15 గంటలకు ఈ దాడి జరిగింది. అయితే ట్రంప్‌ లక్ష్యంగానే దాడి జరిగినట్లు సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు దాడి అనంతరం చెవి నుంచి రక్తం కారుతున్న ట్రంప్ పిడికిలి బిగించి నినాదాలు చేయడం గమనార్హం.

ట్రంపుపై కాల్పులు జరిపిన నిందితుడిని సీక్రెట్ సర్వీస్ పోలీసులు వెంటనే కాల్చి చంపారు. అయితే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) దుండగుడిని థామస్ మ్యాథ్యూ క్రూక్స్(20)గా గుర్తించింది. పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్‌కు చెందిన వ్యక్తి అని తెలిపింది. క్రూక్స్ రిపబ్లికన్ ఓటరుగా పేరు నమోదు చేసుకున్నాడని పలు రికార్డులు చెబుతున్నాయి. రిపబ్లికన్ పార్టీతో సంబంధాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీకి 15డాలర్ల విరాళం కూడా ఇచ్చినట్టు పలు కథనాలు పేర్కొన్నాయి. అయితే దాడికి గల కారణాలను వెల్లడించలేదు. దర్యాప్తు అనంతరం ఘటనకు గల వివరాలను తెలియజేస్తామని ఎఫ్‌బీఐ తెలిపింది. ట్రంపుపై కాల్పులను హత్యాయత్నంగానే భావిస్తున్నట్టు పేర్కొంది.

దేవుడే కాపాడాడు: ట్రంప్

ఘటన అనంతరం ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇలాంటి దాడి జరగడం నమ్మశక్యంగా లేదని పేర్కొన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి హత్యకు గురైనప్పటికీ.. దేశంలో ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరమని తెలిపారు. కాల్పుల సమయంలో ఏదో శబ్దం అయినట్టు అనిపించింది. ఆ వెంటనే నా కుడి చెవి నుంచి బుల్లెట్ దూసుకెళ్లి రక్తస్రావమైంది అని వెల్లడించారు. తనపై జరిగిన కాల్పులపై వేగంగా స్పందించినందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ సహా మిగతా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన కుటుంబానికి, గాయపడివ వారికి సానుభూతి తెలిపారు. దేవుడే తనను కాపాడినట్టు స్పష్టం చేశారు. అమెరికన్లు ఏకం కావాలని పిలుపునిచ్చారు.

దాడిని ఖండించిన బైడెన్, మోడీ

ట్రంపుపై జరిగిన దాడిని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్రంగా ఖండించారు. అమెరికాలో హింసకు చోటు లేదని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అనంతరం ట్రంపుకు బైడెన్ ఫోన్ చేసినట్టు వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, బట్లర్ మేయర్ బాబ్ దండోయ్‌లతో కూడా మాట్లాడినట్టు పేర్కొంది. ఈ ఘటనను భారత ప్రధాని మోడీ కూడా ఖండించారు. ‘నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి పట్ల చాలా ఆందోళన చెందుతున్నా. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. మా ఆలోచనలు, ప్రార్థనలు చనిపోయిన వారి కుటుంబాలు, గాయపడినవారితో ఉన్నాయి’ అని పేర్కొన్నారు. అంతేగాక యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్, అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ బుష్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలు తీవ్రంగా ఖండించారు.

విద్వేషాలను రెచ్చగొట్టద్దు: అమెరికాకు రష్యా సూచన

ట్రంపుపై జరిగిన దాడిపై రష్యా స్పందించింది. ప్రస్తుత బైడెన్ పరిపాలన సరిగా లేదని అందుకు ఈ ఘటనే నిదర్శనమని ఆరోపించింది. విద్వేషాలను రెచ్చగొట్టే తీరు మార్చుకోవాలని సూచించింది. రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా మాట్లాడుతూ..అధికారంలోకి వస్తే ఉక్రెయిన్ ను నియంత్రిస్తానని ట్రంప్ చెప్పడంతోనే ఆయనపై హత్యాయత్నం జరిగిందని భావిస్తున్నట్టు తెలిపారు. దీనిని తీవ్రంగా ఖండించిన ఆయన ఉక్రెయిన్ కు సహాయం చేసే బదులు ఆ ఖర్చంతా పోలీస్ వ్యవస్థ బలోపేతానికి ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

ట్రంపుపై గతంలోనూ హత్యాయత్నాలు !

ట్రంపుపై తాజాగా జరిగిన దాడి తీవ్రకలకలం రేపింది. అయితే గతంలోనూ ట్రంపుపై పలు మార్లు హత్యాయత్నం జరిగినట్టు తెలుస్తోంది. 2016లో లాస్ వెగాస్‌లో జరిగిన ర్యాలీలో ఒక పోలీసు అధికారి నుంచి తుపాకీ లాక్కునేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా ట్రంపును చంపడానికి ఈ చర్యకు పాల్పడ్డానని తెలిపారు. ఈ ఘటన జరిగిన ఒక నెల రోజుల తర్వాత నెవాడాలోని రెనోలో జరిగిన ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతుండగా.. తుపాకీ అనే అరుపులు వినిపించాయి. దీంతో యూఎస్ సీక్రెట్ సర్వీస్ ట్రంపును వెంటనే వేదికపై నుంచి కిందకు దించారు. అయితే అప్పుడు ఎటువంటి ఆయుధాలు గుర్తించలేదు. 2018లో ఓవల్ కార్యాలయంలో ట్రంప్ బస చేసిన సమయంలో కూడా ఆయనకు హాని కలిగించే ప్రయత్నాలు ఎక్కువగా జరిగాయని పలు కథనాలు పేర్కొన్నాయి. 2020లో కెనడా, ఫ్రాన్స్‌ల ద్వంద్వ పౌరసత్వం ఉన్న వ్యక్తి వైట్ హౌస్, ఎనిమిది టెక్సాస్ స్టేట్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు విషపూరిత పదార్ధంతో కూడిన బెదిరింపు లేఖను పంపాడు. అలాగే 2023లో ట్రంపును చంపేస్తామని చికాగో మహిళ ట్రేసీ మేరీ ఫియోరెంజా ఈ మెయిల్ ద్వారా సమాచారం పంపారు.

Tags:    

Similar News