సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తులు డబుల్.. గత ఐదేళ్లలో భారీగా పెరిగిన ప్రాపర్టీస్
రాజస్థాన్ అసెంబ్లీ పోల్స్‌లో పోటీ చేస్తున్న మొత్తం 173 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 93 శాతం మంది ఆస్తులు గత ఐదేళ్లలో 40 శాతం మేర పెరిగాయి.
జైపూర్ : రాజస్థాన్ అసెంబ్లీ పోల్స్‌లో పోటీ చేస్తున్న మొత్తం 173 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 93 శాతం మంది ఆస్తులు గత ఐదేళ్లలో 40 శాతం మేర పెరిగాయి. 2018లో ఈ ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.7.10 కోట్లు కాగా, ఇప్పుడవి రూ.9.97 కోట్లకు పెరిగాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), రాజస్థాన్ ఎలక్షన్ వాచ్ విడుదల చేసిన సంయుక్త నివేదికలో ప్రస్తావించారు. బికనీర్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే సిద్ధి కుమారి ఆస్తులు గత ఐదేళ్లలో అత్యధికంగా పెరిగి రూ.97.61 కోట్ల నుంచి రూ.102.27 కోట్లకు పెరిగాయి.
సెకండ్ ప్లేస్‌లో ఉన్న అంటా అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రమోద్ జైన్ ఆస్తులు రూ. 27.31 కోట్ల నుంచి రూ.56.49 కోట్లకు పెరిగాయి. భారత్ ఆదివాసీ పార్టీ నుంచి తిరిగి పోటీ చేస్తున్న ఎమ్మెల్యేల ఆస్తులు గత ఐదేళ్లలో అత్యధికంగా 9541 శాతం పెరిగాయి. ఈ ఎమ్మెల్యేల ఆస్తుల విలువ సగటున రూ.1 లక్ష నుంచి రూ.1.16 కోట్లకు పెరిగింది. ఇక శివసేన (346 శాతం), సీపీఎం (217 శాతం), రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (184 శాతం) ఎమ్మెల్యేల ఆస్తులు కూడా పెరిగాయి.