అసోంలో భారీ వరదలు.. జలదిగ్బంధంలో 671 గ్రామాలు
ఈశాన్య రాష్ట్రం అసోంని వరదలు ముంచెత్తాయి. వరదల వల్ల ధేమాజీలో ఆదివారం మరో ఇద్దరు చనిపోయారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రం అసోంని వరదలు ముంచెత్తాయి. వరదల వల్ల ధేమాజీలో ఆదివారం మరో ఇద్దరు చనిపోయారు. దీంతో, ఈ ఏడాది వరదలు, తుఫాను, కొండచరియలు విరిగిపడటం వల్ల 44 మంది చనిపోయారని అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ పేర్కొంది. భారీ వర్షాల వల్ల దిబ్రూగఢ్ లోని బ్రహ్మపుత్ర నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తుంది. శివసాగర్ లోని రెండు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సోనిత్ పూర్, బార్ పేట, కరీం గంజ్ లోని నదులు ఉప్పొంగాయి. అసోంలోని 12 జిల్లాల్లో 2.62 లక్షల మంది వరదల వల్ల ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు. 671 గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్లాయి. మొత్తం 2,593 మంది నిరాశ్రయులు 44 సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నార అధికారులు తెలిపారు.
రెస్క్యూ ఆపరేషన్
పలు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ధేమాజీ జిల్లాలో 300 మందిని, టిన్సుకియాలో 20 మందిని, దిబ్రూగఢ్ లో ముగ్గురిని బోట్ల ద్వారా రక్షించారు. ధేమాజీ జిల్లాలో పడవల ద్వారా దాదాపు వెయ్యి జంతువులను కాపాడారు. ఇవే కాకుండా, పలు ప్రాంతాల్లో వరదల కారణంగా రోడ్లు, వంతెనలు, కట్టలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. కేంద్రమంత్రి సోనోవాల్ దిబ్రూగఢ్ నియోజకవర్గంలో వరద పరిస్థితిని సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని దాటడంతో.. అక్కడ వరద పరిస్థితిని కూడా ఆయన పరిశీలించారు.