వరద గుప్పిట్లో 411 గ్రామాలు.. ఇద్దరు చిన్నారులు మృతి
దిశ, నేషనల్ బ్యూరో : ఈశాన్య రాష్ట్రం అసోంను వరదలు వణికిస్తున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో : ఈశాన్య రాష్ట్రం అసోంను వరదలు వణికిస్తున్నాయి. రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది, దాని ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదలతో ఏడు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకటించింది. ఈ ఏడు జిల్లాల్లోని 411 గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయని వెల్లడించింది. వరదల కారణంగా 2.62 లక్షల మంది ప్రజానీకం ప్రభావితులయ్యారని తెలిపింది.
వారిలో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలలోని తాత్కాలిక షెల్టర్లకు తరలించారు. 4 వేల హెక్టార్లకుపైగా వ్యవసాయ భూమి కూడా దెబ్బతిన్నదని పేర్కొంది. ఈ ప్రభావితమైన వ్యవసాయ భూములలో ఎక్కువ భాగం నాగోన్ జిల్లాలోనే ఉండటం గమనార్హం. తాజాగా ఆదివారం రోజు వరదల్లో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 34కు పెరిగింది.