ఎత్తు నుంచి పల్లానికి వరద నీరు ప్రవహించడం సాధారణం.. కేజ్రీవాల్ కు అస్సాం సీఎం కౌంటర్
యమునా నది ఉప్పొంగడంతో ఢిల్లీ వీధులన్నీ వరద నీటిలో మునిగిపోయిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్: యమునా నది ఉప్పొంగడంతో ఢిల్లీ వీధులన్నీ వరద నీటిలో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ వరదలకు హర్యాణా, యూపీ నుంచి వచ్చిన వరద నీరే కారణమని అన్నారు. కాగా తాజాగా ఢిల్లీ సీఎం వ్యాఖ్యలను అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఖండించారు. తమ రాష్ట్రానికి కూడా అరుణాచల్ ప్రదేశ్, భూటాన్ నుంచి వరద నీరు వస్తుందని, కానీ తాము ఏనాడు ఇలా మాట్లాడలేదని స్పష్టం చేశారు.
ఎత్తు నుంచి పల్లానికి వరద నీరు ప్రవహించడం సర్వసాధారణమని ఆయన తెలిపారు. దీన్ని అరికట్టడానికి శాస్త్రీయపరమైన పరిష్కారాన్ని కనుగొనాలే తప్ప, ఇతర రాష్ట్రాలను నిందించడం వల్ల ఒరిగేదేమీలేదని అన్నారు. తమ సమస్యలను ఇతరుల మీద రుద్దడం సరికాదని, వీలైనంత మేరకు పరిష్కరించుకోవాలని కేజ్రీవాల్ కు చురకలు అంటించారు.