ఇప్పుడే 8 ఓట్లను దోచుకుంటే.. రానున్న ఎన్నికల్లో ఎన్ని కోట్ల ఓట్లు దోచుకుంటారో?: కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

ఈ ఎన్నికలో బీజేపీ 8 ఓట్లు దోచుకుంది. అంటే 25శాతం.

Update: 2024-02-20 17:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో: చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సుప్రీంకోర్టు బ్యాలెట్ పేపర్లను తెప్పించుకుని మరీ ఫలితాలను ప్రకటించడం స్వతంత్ర భారత చరిత్రలో నాకు తెలిసి ఇదే తొలిసారి. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నియంతృత్వం రాజ్యమేలుతూ, స్వయంప్రతిపత్తి సంస్థలు అణచివేతకు గురవతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తీర్పు ఎంతో కీలకమైనది. వారు (బీజేపీని ఉద్దేశించి) ఎన్నికలను దొంగిలిస్తే.. మేము తిరిగి గెలుచుకున్నాం. ఇండియా కూటమికి ఇది పెద్ద విజయం. బీజేపీని ఓడించలేమని చెబుతున్నవారు.. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా ఇండియా కూటమిలోని భాగస్వాములందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఇది చండీగఢ్ ప్రజల విజయం’’ అని వెల్లడించారు. ‘‘ఈ ఎన్నికలో బీజేపీ 8 ఓట్లు దోచుకుంది. అంటే 25శాతం. త్వరలో అతి పెద్ద(లోక్‌సభ) ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో 90 కోట్ల ఓట్లుంటాయి. అంటే, ఎన్ని కోట్ల ఓట్లను దోచుకోగలరో ఊహించండి’’ అంటూ వ్యాఖ్యానించారు. ఓట్లను తారుమారు చేసిన రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ గురించి మాట్లాడుతూ, ‘‘అతని అదృష్టం బాగాలేదు. సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ప్రతీదీ అందులో రికార్డయింది. వాళ్లు(బీజేపీ) ఓట్లను ఎలా దోచుకుంటున్నారో ఆ వీడియోను చూస్తే స్పష్టమవుతోంది’’ అని ఆరోపించారు.


Tags:    

Similar News