Arvind Kejriwal : మహిళలకు ప్రతినెలా రూ.2,100.. రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) మరో సంచలన హామీని ప్రకటించారు.
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) మరో సంచలన హామీని ప్రకటించారు. తాము మళ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే 18 ఏళ్లకు పైబడిన ప్రతీ మహిళ(Delhi women)కు నెలకు రూ.2,100 చొప్పున ఆర్థికసాయాన్ని అందిస్తామని ఆయన వెల్లడించారు. ఈ ప్రతిపాదనకు గురువారం ఉదయమే సీఎం అతిషి సారథ్యంలోని ఢిల్లీ(Delhi) మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. అర్హులైన మహిళల ఎంపికకు శుక్రవారం నుంచే దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.
‘‘మరో 10 నుంచి 15 రోజుల్లోగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పటికిప్పుడు ఈ స్కీంను అమలు చేసి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమచేయడం సాధ్యం కాదు’’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ‘‘గతంలో నేను మహిళలకు ప్రతినెలా రూ.1000 ఇస్తానని ప్రకటించాను. ప్రస్తుతం ప్రతీ వస్తువు ధరలు మండిపోతున్నందున రూ.1000 చాలవు అని చాలామంది మహిళలు నాతో చెప్పారు. అందుకే ప్రతినెలా రూ.2,100 ఇవ్వాలని నిర్ణయించాం’’ అని ఆప్ అధినేత తెలిపారు. ఇక ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షల వరకు జీవిత బీమా, రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా ఇస్తామని ఇటీవలే కేజ్రీవాల్ ప్రకటించారు. ఆటో డ్రైవర్ల కుమార్తెల పెళ్లిళ్లకు రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామన్నారు. ఆటోవాలాలకు యూనిఫాం అలవెన్స్ కింద ఏడాదికి రెండుసార్లు రూ.2,500 చొప్పున ఇస్తామని చెప్పారు.