Arvind Kejriwal : 11వేల మంది ఓటర్ల పేర్లు తొలగింపునకు బీజేపీ కుట్ర : కేజ్రీవాల్

దిశ, నేషనల్ బ్యూరో : త్వరలో ఢిల్లీ(Delhi) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెద్దసంఖ్యలో ఓటర్ల పేర్లను డిలీట్ చేయించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆరోపించారు.

Update: 2024-12-06 13:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో : త్వరలో ఢిల్లీ(Delhi) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెద్దసంఖ్యలో ఓటర్ల పేర్లను డిలీట్ చేయించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆరోపించారు. ఢిల్లీలోని షాహ్ దారా ఏరియాకు చెందిన 11,018 మంది ఓటర్ల పేర్లను డిలీట్ చేయాలంటూ ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసిందన్నారు. తాము ఆ 11,018 మంది ఓటర్లలోని 500 మంది వివరాలను తనిఖీ చేయగా.. 75 శాతం మంది షాహ్ దారా ఏరియాలోనే నివసిస్తున్నట్లు తేలిందన్నారు. అయినా అలాంటి వేలాది మంది స్థానికుల పేర్లను ఓటరు జాబితాల(Delhi electoral rolls) నుంచి తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

‘‘2020లో జరిగిన ఎన్నికల్లో షాహ్ దారా అసెంబ్లీ స్థానాన్ని ఆప్ గెలుచుకుంది. బీజేపీ తొలగించాలని భావిస్తున్న దాదాపు 11వేల మంది ఓటర్లలో అత్యధికులు ఆప్ పార్టీ మద్దతుదారులే ఉన్నారు’’ అని ఆయన తెలిపారు. ఈవిధంగా కుట్రపూరితంగా పెద్దసంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగించి ఎన్నికలను నిర్వహించడంలో అర్థమే ఉండదని ఆప్ చీఫ్ విమర్శించారు. ఇలాంటి కుట్రలు ప్రజాస్వామ్యానికే పెనుముప్పు లాంటివన్నారు. ఇక కేజ్రీవాల్ ఆరోపణలపై షాహ్ దారా జిల్లా మెజిస్ట్రేట్ స్పందించారు. ‘‘షాహ్ దారా ఏరియాకు సంబంధించి 2024 అక్టోబరు 29 నుంచి ఇప్పటివరకు ఓటర్ల పేర్లు తొలగింపునకు సంబంధించిన ఫామ్-7లు 494 మాత్రమే వచ్చాయి. 11,018 మంది ఫామ్-7లను సమర్పించినట్లుగా కేజ్రీవాల్ చెబుతున్నారు. అది అవాస్తవం’’ అని జిల్లా మెజిస్ట్రేట్ వెల్లడించారు.

Tags:    

Similar News