ఈవీఎం మార్చేందుకు రూ. 2.5 కోట్లు అడిగిన ఆర్మీ జవాన్

మోసం జరుగుతుందని గమనించిన రాజకీయ నేత పోలీసులకు సమాచారం అందించాడు.

Update: 2024-05-08 09:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి కొనసాగుతున్న వేళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) మార్చేందుకు ప్రయత్నించిన ఓ ఆర్మీ జవానును మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈవీఎం మార్చడానికి ఓ రాజకీయ నాయకుడిని రూ. 2.5 కోట్లు ఇవ్వాలని జావను డిమాండ్ చేశాడు. అయితే, మోసం జరుగుతుందని గమనించిన రాజకీయ నేత పోలీసులకు సమాచారం అందించాడు. రాష్ట్రంలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన దాని ప్రకారం, మారుతీ ధక్నే అనే వ్యక్తి ఆర్మీ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతడు పూణెలోని శాసనమండలి ప్రతిపక్ష శివసేన(యూబీటీ) నేత అంబాదాస్ ధన్వేను కలిసి చిప్‌ని ఉపయోగించి ఈవీఎంలను మార్చవచ్చని నమ్మబలికాడు. దానికోసం కొంత సొమ్ము కావాలని అడిగాడు. అయితే, అప్రమత్తమైన అంబాదాస్ పోలీసులకు సమాచారం అందించాడు. పక్కా వ్యూహంతో ఆర్మీ ఉద్యోగిని ఓ హోటల్‌కు రమ్మని చెప్పి రూ. 1.5 కోట్లకు ఒప్పందం చేసుకున్నట్టుగా నమ్మించి, టోకెన్ కింద రూ. లక్ష ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రాథమిక విచారణలో నిందితుడికి పెద్ద మొత్తంలో అప్పులు ఉన్న కారణంగా అడ్డదారిలో సంపాదన కోసం ఈ మోసానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అతనికి ఈవీఎంల గురించి ఎలాంటి అవగాహన లేదని పేర్కొన్నారు. అహ్మద్‌నగర్‌కు చెందిన మారుతీ ధక్నె ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ ప్రాంతంలో ఆర్మీ బేస్‌లో పనిచేస్తున్నాడు.  

Tags:    

Similar News