H-1B: హెచ్1బీ, ఎఫ్1 వీసాదారుల ఆందోళన.. ఇమ్మిగ్రేషన్ హెల్ప్ డెస్క్ సేవలను మూసేసిన ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మూడు ముఖ్యమైన పర్యవేక్షణా సంస్థలను మూసివేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల మూడు ముఖ్యమైన పర్యవేక్షణా సంస్థలను మూసివేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (CIS) అంబుడ్స్‌మన్ కార్యాలయం కూడా ఉంది. ఈ క్రమంలోనే సీఐఎస్ కార్యాలయ సిబ్బందిని 60 రోజుల సెలవుపై పంపించారు. అయితే హెచ్1బీ, ఎఫ్1 వీసాదారులు ఏమైనా సమస్యలుంటూ సీఐఎస్ కార్యాలయం నుంచి సహాయం తీసుకునే వారు. కీలక సేవలన్నీ ఈ ఆఫీస్ నుంచే పొందేవారు. దరఖాస్తులను తప్పుగా తిరస్కరించడం, డాక్యుమెంట్లలో లోపాలు, ఇతర సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు సీఐఎస్ కార్యాలయం సహాయం చేసేది. గతేడాది సుమారు 30,000 మంది దరఖాస్తుదారులకు సహాయం చేసింది. ట్రంప్ తాజా నిర్ణయంతో హెచ్1బీ, ఎఫ్1 వీసాదారులతో పాటు గ్రీన్ కార్డు దరఖాస్తు దారులు ఆందోళన చెందుతున్నారు. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరిని సంప్రదించాలో తెలియక సతమతమవుతున్నారు.
అయితే అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (AILA), ఇతర న్యాయవాద సంఘాలు ట్రంప్ ప్రభుత్వం చర్యను ఖండించాయి. ఈ నిర్ణయం వల్ల ఇమ్మిగ్రేషన్ విషయాలపై నియంత్రణ ఉండబోదని హెచ్చరించాయి. పర్యవేక్షణ సంస్థలను తొలగించడం వల్ల ట్రంప్ పరిపాలనకు శిక్ష నుంచి మినహాయింపు పొందే అధికారం లభిస్తుందని పేర్కొన్నాయి. డెమోక్రటిక్ చట్టసభ సభ్యులు కూడా ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభావిత కార్యాలయాలలో ఒకటైన ఆఫీస్ ఫర్ సివిల్ రైట్స్ అండ్ సివిల్ లిబర్టీస్ చట్టం ప్రకారం సీఐఎస్ కార్యాలయం అందుబాటులో ఉండాలని తెలిపారు.