Anti-Conversion Bill: మోసపూరిత మత మార్పిడులకు జీవిత ఖైదు.. నాన్‌బెయిలబుల్‌ కేసు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మంగళవారం మతమార్పిడి నిరోధక చట్టం కింద శిక్షలను పెంచే సవరణ బిల్లును ఆమోదించింది.

Update: 2024-07-30 13:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మంగళవారం మతమార్పిడి నిరోధక చట్టం కింద శిక్షలను పెంచే సవరణ బిల్లును ఆమోదించింది. దీంతో బలవంతంగా మోసపూరిత మతమార్పిడికి పాల్పడినట్టయితే వారికి కఠిన శిక్షలు విధించనున్నారు. సవరించిన బిల్లు ప్రకారం, నిందితులకు గరిష్టంగా జీవిత ఖైదు, రూ.5 లక్షల జరిమానా విధిస్తారు. అదే పాత విధానంలో అయితే రూ.50,000 జరిమానా, 10 సంవత్సరాల శిక్ష ఉండేది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ ఖన్నా సోమవారం సభలో ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధమైన మత మార్పిడి (సవరణ) బిల్లు, 2024ను ప్రవేశపెట్టారు. మంగళవారం దీనికి ఆమోదం లభించింది.

ప్రతిపాదిత సవరణ ప్రకారం, ఒక వ్యక్తి ఒక మహిళను, మైనర్‌ను లేదా ఎవరినైనా మతం మార్చాలనే ఉద్దేశ్యంతో బెదిరించినా, దాడి చేసినా, వివాహం చేసుకున్నా, పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసినా లేదా దాని కోసం కుట్ర చేసినా లేదా అక్రమ రవాణా చేసినా, అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించి నేరానికి పాల్పడిన వారికి, 20 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది.

ఇంతకుముందు, ఎవరైనా మతమార్పిడి కేసుకు సంబంధించి సమాచారం లేదా ఫిర్యాదు చేయాలనుకుంటే బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు లేదా తోబుట్టువులు ఉండాల్సింది. కాగా, ఇకపై ఎవరైనా మత మార్పిడి కేసుల్లో పోలీసులకు లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వవచ్చు. అలాగే, ఈ కేసులను సెషన్స్ కోర్టు దిగువన ఉన్న ఏ కోర్టు విచారించదు. దీనితో పాటు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అవకాశం ఇవ్వకుండా బెయిల్ పిటిషన్‌ను పరిగణించదు. ప్రస్తుతం ఈ నేరాలన్నీ నాన్‌బెయిలబుల్‌గా మార్చారు. 'లవ్ జిహాద్'ను అరికట్టాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ చొరవ తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతకుముందు 2021లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మత మార్పిడి నిషేధ చట్టాన్ని ఆమోదించారు. తాజాగా శిక్షలను మరింత పెంచుతూ కొత్త బిల్లుకు ఆమోదం తెలిపారు.

Tags:    

Similar News