కేజ్రీవాల్‌కు మరో షాక్: ఢిల్లీలోని ఆప్ నేతల ఇళ్లలో ఈడీ సోదాలు

మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ ఎన్డీ గుప్తా అలాగే ఈ కేసుతో సంబంధమున్న మరి కొందరి ఆప్ నేతల ఇళ్లలో ఈడీ మంగళవారం సోదాలు నిర్వహించింది.

Update: 2024-02-06 06:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ ఎన్డీ గుప్తా అలాగే ఈ కేసుతో సంబంధమున్న మరి కొందరి ఆప్ నేతల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం సోదాలు నిర్వహించింది. ఢిల్లీలోని సుమారు 12 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. ఢిల్లీ జల్ బోర్డు(డీజేబీ) టెండర్ ప్రక్రియల్లో జరిగిన అవకతవకలపై నమోదైన కేసులో భాగంగా ఈ దాడులు నిర్వహించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. డీజేబీ అధికారులు విద్యుదయస్కాంత ప్రవాహ మీటర్ల సరఫరా, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్‌ల కోసం టెండర్ వేశారు. అయితే ఒక సంస్థకు మాత్రమే వీటిని కట్టబెట్టారని సాంకేతిక అర్హతలు లేకపోయినా కంపెనీకి రూ.38 కోట్ల అక్రమ కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపణలున్నాయి. దీంతో సీబీఐ, ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. డీజేబీ టెండర్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపించింది. ప్రస్తుతం ఈ కేసును ఈడీ విచారిస్తోంది. ఈ క్రమంలోనే జనవరి 31న డీజేబీ మాజీ చీఫ్ ఇంజనీర్ జగదీష్ కుమార్ అరోరా, వ్యాపార వేత్త అనిల్ అగర్వాల్‌లను అరెస్టు చేసింది. తాజా దాడులతో ఈడీ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది.

బీజేపీ ఆప్‌ను ఆణచివేయాలని చూస్తోంది: ఢిల్లీ మంత్రి అతిశీ

ఈడీ తనిఖీల నేపథ్యంలో ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిశీ స్పందించారు. బీజేపీ ఆప్‌ని అణచివేయాలని చూస్తోందని ఆరోపించింది. కానీ కాషాయ పార్టీకి ఎప్పటికీ భయపడబోమని స్పష్టం చేసింది. ‘మేం కుంభకోణం చేయలేదు. ఈడీ విచారణలోనే స్కామ్ ఉంది. మద్యం పాలసీ కేసులో సాక్షుల వాంగ్మూలాలను ఈడీ తప్పుబట్టింది’ అని విమర్శించారు. ఈ కేసులో ఎటువంటి ఆధారాలూ లేక పోయినా ఈడీ విచారణ చేపట్టడం దారుణమని తెలిపారు. లిక్కర్ పాలసీ స్కాంలో విచారణ తర్వాత అన్ని ఆడియో పుటేజీలను ఈడీ తొలగించిందన్నారు. ఆడియోల తొలగింపు ద్వారా ఎవరిని రక్షించాలనుకుంటున్నారని ప్రశ్నించింది. 

Tags:    

Similar News