లక్నో: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. 32ఏళ్లుగా కాంగ్రెస్‌లోనే కొనసాగిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్(ఆర్పీఎన్) సింగ్ మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన రెండేళ్ల క్రితం కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా ఆధ్వర్యంలో కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రతన్‌జిత్ మాట్లాడుతూ.. 'నేను మూడు దశాబ్దాలుగా ఒకే పార్టీలో ఉన్నాను.
కానీ, ఆ పార్టీ ఇప్పుడు ఒకప్పటిలా లేదు. నేడు ప్రజల ప్రయోజనాలు, దేశాభివృద్ధి కోసం కృషి చేసే పార్టీ ఏదైనా ఉందా.. అంటే అది బీజేపీయే. ఇది అందరికీ తెలుసు' అని అన్నారు. కాగా, ఉత్తర యూపీలో కీలకమైన ఓబీసీ నేతగా ఉన్న ఆర్పీఎన్ సింగ్ రాజీనామా.. పార్టీ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన పడ్రానా స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలున్నాయి.
'పిరికిపందలు యుద్ధంలో పోరాడలేరు'
ఆర్పీఎన్ సింగ్ పార్టీని వీడి బీజేపీలో చేరడం పై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. 'ప్రభుత్వంపై, వాటి ఏజెన్నీల తీరుపై కాంగ్రెస్ దేశంలో, ప్రత్యేకంగా యూపీలో పోరాటం చేస్తున్నది. ఈ యుద్ధం భావాజాలం, సత్యం తో కూడుకున్నది. ఇందులో పోరాడాలంటే, ధైర్యం, నిబద్ధత అవసరం. పిరికివాళ్ళు ఈ యుద్ధంలో పోరాడలేరు' అని కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రినేట్ వెల్లడించారు.