కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి..

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మరో చీతా మరణించింది.

Update: 2023-07-14 11:11 GMT

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మరో చీతా మరణించింది. శుక్రవారం ఉదయం ఆఫ్రికన్ మగ చీతా సూరజ్ నిర్జీవ స్థితిలో కనిపించింది. దీంతో గడిచిన నాలుగు నెలల్లో ఈ పార్క్‌లో ప్రాణాలు కోల్పోయిన చిరుతల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. చీతా మరణానికి గల కారణాలను తెలుసుకుంటామని అధికారులు చెప్పారు. కునో నేషనల్ పార్క్‌లో ఉంటున్న తేజస్ అనే మగ చిరుత మంగళవారం (జులై 11న) మరణించింది.

ఓ ఆడ చిరుతతో తేజస్‌కు జరిగిన ఘర్షణలో తీవ్రమైన షాక్ తగిలిందని, దాని నుంచి అది కోలుకోలేకపోయిందని పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. మే 25న రెండు చిరుత పులి పిల్లలు వడగాలుల ధాటిని తట్టుకోలేక డీహైడ్రేషన్‌‌కు గురై మరణించాయి. మే 9న దక్ష అనే ఆడ చిరుత ఓ మగ చిరుతతో సంతానోత్పత్తి ప్రక్రియలో పాల్గొంటుండగా మరణించింది. ఏప్రిల్ 23న ఉదయ్ అనే చిరుత కార్డియో పల్మనరీ వైఫల్యంతో ప్రాణాలు కోల్పోయింది. మార్చి 27న ఆడ చిరుత సాషా మూత్రపిండాల వ్యాధితో మరణించింది.


Similar News