రాత్రి 10 దాటితే ముసలోళ్లకి ఫ్రీ..! 26 ఏళ్ల నుంచి ఆమె ఇలా ఎందుకు చేస్తుంది..?!
ఈ సమాజంలో ఆమె ఓ అపూర్వ నిర్ణయం తీసుకుంది. Raji Ashok offer free ride for old people, Women, government school girls.
దిశ, వెబ్‌డెస్క్ః 'కార్పొరేట్ సామాజిక బాధ్యత' పేరున సోషల్ సర్వీస్ చేయడం ఫ్యాషన్‌గా మారిన ఈ రోజుల్లో రెక్కాడితేగాని డొక్కాడని స్థితిలో ఉన్న ఓ మహిళ సామాజిక సేవ చేస్తోంది. తమిళనాడులోని చెన్నైకి చెందిన ఓ ఆటో డ్రైవర్ ఆమె. ఆడపిల్ల పట్టపగలే ఒంటిరిగా తిరగడానికి భయపడుతున్న ఈ సమాజంలో ఆమె ఓ అపూర్వ నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటలు దాటితే మహిళలు, వృద్ధులను తన ఆటోలో ఉచితంగా గమ్యస్థానం చేరుస్తోంది. ముఖ్యంగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధినులకు ఆమె సహాయం చేస్తుంది. అంతేకాదు, అత్యవసర పరిస్థితుల్లో ఎవర్నైనా ఉచితంగానే తన ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్తుంది. 50 ఏళ్ల వయసున్న రాజి అశోక్ చేస్తున్న ఈ సేవ ఎంతో మందికి ప్రేరణ ఇస్తోంది.
విద్యార్జనతోనే జ్ఞానం సుసంపన్నమౌతుందని అనడానికి రాజీ ఓ ఉదాహరణ. రాజీ అశోక్ బీఏ గ్రాడ్యుయేట్. అయితే, డిగ్రీ చేసినా బతకడానికి సరిపడా ఉద్యోగం దొరకడం కష్టమని తెలుసుకున్న ఆమె జీవనోపాధి కోసం, తన కుటుంబాన్ని పోషించడం కోసం ఆటోరిక్షా నడపడమే మేలనుకుంది. ఇక, ఆమె భర్త అశోక్ కూడా ఆటోవాలానే. కేరళ నుంచి చెన్నైకి వెళ్లిన వీరివురూ సమాజసేవ చేస్తూ ఆనందిస్తున్నారు. ఎందుకని అడిగితే, 'సమాజంలో పితృస్వామ్య భావజాలాన్ని నిర్మూలించాలంటే ఎన్నో సవాళ్లను అధిగమించాలని, అందులో భాగంగానే నాకు తోచినంతలో నేను సహాయం చేస్తున్నానని' అంటారు.