Jharkhand Maharashtra Results: 72 గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మహారాష్ట్రలో నిన్నటి నుంచే రిసార్టు రాజకీయాలు (Resort Politics) మొదలయ్యాయి. గెలుపు అవకాశాలున్న అభ్యర్థులను ఆయా పార్టీలు రిసార్టులకు తరలించాయి.

Update: 2024-11-23 03:22 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఈ రోజు మరో బిగ్ డే కాబోతోంది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు.. మరో 13 రాష్ట్రాల్లో 46 అసెంబ్లీ స్థానాలకు, రెండు పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. వీటిలో వయనాడ్ ఉపఎన్నిక ఫలితంపై అందరి దృష్టి ఉంది. రాహుల్ గాంధీ రాజీనామా చేయడం వయనాడ్ లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారి పోటీ చేశారు. నాందేడ్ పార్లమెంట్ ఉపఎన్నిక ఫలితం కూడా నేడే వెల్లడి కానుంది.

మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఫలితాలపై (Maharashtra Jharkhand Elections Results 2024) ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మహారాష్ట్రలో మహాయుతి (Mahayuthi) కూటమి, మహా అఘాడీ (Maha Aghadi) కూటమి నువ్వా - నేనా అన్నట్టు పోటీ పడ్డాయి. 288 కౌంటిగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను మెజార్టీ మార్కు 145 గా ఉంది. మహాయుతి కూటమిలో బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేయగా.. మహా అఘాడీ కూటమిలోని కాంగ్రెస్ 101, శివసేన (ఉద్ధవ్) 95, ఎన్సీపీ 86 స్థానాల్లో పోటీ చేశాయి. బీఎస్పీ 237, ఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేశాయి.

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మహారాష్ట్రలో నిన్నటి నుంచే రిసార్టు రాజకీయాలు (Resort Politics) మొదలయ్యాయి. గెలుపు అవకాశాలున్న అభ్యర్థులను ఆయా పార్టీలు రిసార్టులకు తరలించాయి. మహాఅఘాడీ కూటమి.. స్వతంత్రగా పోటీ చేసి గెలిచే అవకాశాలున్న అభ్యర్థుల్ని కూడా రిసార్టులకు పంపింది. వారితో కలిసి మెజార్టీ మార్కుకు చేరువైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ లో మహాయుతి కూటమికే గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పినప్పటికీ.. ఫలితాలు తారుమారయ్యే అవకాశాలున్నాయని, తాము కూడా గెలిచే ఛాన్స్ ఉందని ధీమా వ్యక్తం చేస్తోంది మహా అఘాడీ కూటమి.

మహారాష్ట్రలో ఏ కూటమి గెలిచినా 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎందుకంటే ఈ నెల 26వ తేదీతో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తోంది. అందుకే ఏ కూటమి గెలిచినా 2-3 రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.

ఝార్ఖండ్ లో ఇలా..

ఝార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాలుండగా.. అధికారంలోకి రావాలంటే 41 స్థానాల్లో గెలిచి తీరాలి. బీజేపీ 68, ఏజేఎస్ యూ 10, జేడీయూ 2, లోక్ జన్ శక్తి (రామ్ విలాస్) పార్టీ ఒక స్థానంలో పోటీ చేశాయి. విపక్ష కూటమి తరఫున జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐ (ఎంఎల్) 4 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశాయి. ఇక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్.. ఎన్డీయేకే గెలిచే అవకాశాలున్నట్లు తేల్చేశాయి. ఇక్కడ ఎన్డీయేకు 40 నుంచి 45 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. 

Tags:    

Similar News