Ammonia Gas: ఐస్ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్.. ఓ కార్మికుడు మృతి
పంజాబ్‌లోని జలంధర్‌లో విషాదం జరిగింది. ఐస్ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.
దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లోని జలంధర్‌లో విషాదం జరిగింది. ఐస్ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. కార్మికులంతా తమ పనిలో నిమగ్నమై ఉండగా శనివారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మార్కెట్ మధ్యలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో గ్యాస్ పైపు పగిలిపోగా ఒక్కసారిగా గ్యాస్ లీకైంది. లీకేజీ సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫ్యాక్టరీ నుంచి ఆరుగురు వ్యక్తులను రక్షించారు. దాదాపు రెండు గంటలపాటు శ్రమించి గ్యాస్ లీకేజీని అరికట్టారు. ఆ ప్రాంతానికి వచ్చే రోడ్లను మూసి వేశారు. ఘటన అనంతరం సమీపంలోని దుకాణదారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
గ్యాస్ గాఢత ఎక్కువగా ఉండటంతో అటుగా వెళ్తున్న వ్యక్తులు స్పృహతప్పి పడిపోయారని పలువురు స్థానికులు తెలిపారు. సుమారు 100 మీటర్ల మేర గ్యాస్ వ్యాపించినట్టు వెల్లడించారు. లీకేజీకి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తిని జలంధర్‌కు చెందిన శీతల్ (68)గా గుర్తించారు. ఆయన 3 నెలల నుంచి ఫ్యాక్టరీలో పని చేస్తున్నట్టు తెలిపారు. జలంధర్ డిప్యూటీ కమిషనర్ హిమాన్షు అగర్వాల్ ఈ ఘటనపై మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. దీనిపై 15 రోజుల్లోగా నివేదిక అందజేయాలని తెలిపారు.