Amith shah: వక్ఫ్‌ బోర్డులో ముస్లిమేతరులు జోక్యం చేసుకోలేరు.. కేంద్ర మంత్రి అమిత్ షా

వక్ప్ సవరణ బిల్లు-2024 ఎట్టకేలకు లోక్ సభ ముందుకు వచ్చింది. మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

Update: 2025-04-02 18:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వక్ప్ సవరణ బిల్లు-2024 ఎట్టకేలకు లోక్ సభ ముందుకు వచ్చింది. మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ (UMEED) అని పేరు పెట్టారు. బిల్లుపై సుమారు 12 గంటల పాటు చర్చ చేపట్టారు. ఈ చర్చలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు జోక్యం చేసుకోలేరని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలు కావాలనే ముస్లింలను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. వక్ఫ్ బోర్డు ఉన్నది పేద ముస్లింల కోసమేనని, దొంగల కోసం కాదని స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డులోని ముస్లిమేతర సభ్యులకు మతపరమైన వ్యవహారాల నిర్వహణలో ఎటువంటి పాత్ర ఉండబోదని తెలిపారు. ఈ చట్టం ఏ సమాజ మతపరమైన ఆచారాలలో జోక్యం చేసుకోదని నొక్కి చెప్పారు. బిల్లుపై ప్రతిపక్ష నాయకులు అపోహలను వ్యాప్తి చేస్తున్నారని విమర్శించారు. ఓటు బ్యాంకు కోసమే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మైనారిటీలలో భయాన్ని సృష్టించడానికి, నిర్దిష్ట ఓటర్ల జనాభాను సంతోషపెట్టడానికి ఈ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారన్నారు.

ఇస్లాం కాని వ్యక్తి వక్ఫ్‌లోకి రారని, అలాంటి నిబంధన చట్టంలో లేదని తెలిపారు. ముస్లిమేతర సభ్యులు మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదని, వక్ఫ్ చట్టం పరిపాలన, విరాళాల ద్వారా వచ్చే నిధులు సజావుగా నడుస్తున్నాయా లేదా అని పర్యవేక్షించడం వారి పని అని తెలిపారు. 2013లో మార్పులు చేసి ఉండకపోతే వక్ఫ్ సవరణ బిల్లు అవసరం ఉండేది కాదన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి తీవ్రమైన సవరణలు చేసే వరకు అంతా సజావుగా జరిగిందన్నారు. ఎన్నికలకు కేవలం 25 రోజుల ముందు ఢిల్లీలోని 123 వీవీఐపీ ఆస్తులను వక్ఫ్‌కు అప్పగించారని ఆరోపించారు. వక్ఫ్ బిల్లుకు మెజారిటీ వర్గాల మద్దతు ఉందని, కానీ కొన్ని పార్టీలు మైనారిటీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నాయన్నారు.

Tags:    

Similar News