Amit Shah : ‘భారత్ పోల్’ పోర్టల్‌ను ప్రారంభించిన అమిత్ షా
‘భారత్ పోల్’ పోర్టల్‌ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు.
దిశ, నేషనల్ బ్యూరో : ‘భారత్ పోల్’ పోర్టల్‌ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. మంగళవారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. ‘అంతర్జాతీయ స్థాయిలో నేర విచారణను భారత్ పోల్ మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఇంటర్‌పోల్‌తో పనిచేసేందుకు ఇప్పటి వరకు సీబీఐకి మాత్రమే గుర్తింపు ఉండేది. భారత్ పోల్ లాంచ్ చేయడం ద్వారా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఇంటర్ పోల్‌తో సులువుగా కనెక్ట్ అయ్యే వీలుంటుంది. నేరాల నియంత్రణను సమర్ధంగా నిర్వహించేందుకు భారత్ పోల్ పోర్టల్ పనిచేస్తుంది. భారత్ పోల్ పెద్ద మొత్తంలో సమాచారాన్ని వేగంగా యాక్సెస్ చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సవాళ్లను గమనించి మన సిస్టమ్‌లో మార్పులు చేసుకోవాల్సిందే. అందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలి. ఆ దిశలో వేసిన ముందడుగే భారత్ పోల్.’ అని అమిత్ షా అన్నారు. సైబర్, ఆర్థిక నేరాలు, మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, ఆన్‌లైన్ రాడికలైజేషన్ నియంత్రించేందుకు ఈ పోర్టల్‌ను అభివృద్ధి చేసినట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేరస్తులను పట్టుకునేందుకు సీబీఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్) ఈ పోర్టల్‌ను డెవలప్ చేసినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. 2021 నుంచి ఇప్పటి వరకు వంద మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌ను ఇంటర్ పోల్ భారత్‌కు తీసుకువచ్చిందని.. కేవలం 2024లోనే 26 మందిని స్వదేశానికి రప్పించినట్లు కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.