సవాళ్లను ఎదుర్కోవడంలో యువత సామర్థ్యం ఆశ్చర్యం కలిగిస్తోంది: సీజేఐ

దేశంలో మారుతున్న కాలానికి సంకేతమన్నారు

Update: 2024-02-04 14:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుత తరంలో ఎదురవుతున్న అనేక సవాళ్లను ఎదుర్కోవడంలో యువతకు ఉన్న సామర్థ్యాన్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. అలాగే, వైఫల్యాల నుంచి యువత పాఠాలు నేర్చుకోవాలని, అవాస్తవాలకు లొంగిపోవద్దని సూచించారు. ఆదివారం వడోదరలోని మహారాజా సాయాజీరావు యూనివర్శిటీ ఆఫ్ బరోడా 72వ వార్షికోత్సవంలో గ్రాడ్యుయేట్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన సీజేఐ, 'జీవితం ఒక మారథాన్, 100 మీటర్ల స్ప్రింట్ కాదు. ఈ ఏడాది 346 బంగారు పతకాల్లో 336 పతకాలను మహిళలు అందుకున్నారు. ఇది నిజంగా దేశంలో మారుతున్న కాలానికి సంకేతమని' అన్నారు. 'ప్రస్తుతం మనం చరిత్రకు సంబంధించి విశిష్టమైన సందర్భంలో ఉన్నాం. టెక్నాలజీ గతంలో కంటే ఎక్కువగా ప్రజలను కనెక్ట్ చేసింది. ఇదే సమయంలో వారిలో ఉన్న భయాలు, ఆందోళనలను కూడా బయటపెట్టింది. ప్రతిరోజు కొత్త ఉద్యోగాలు పుడుతున్న పరిణామాలను చూస్తున్నాం. ప్రజలు తమ ఉద్యోగ జీవితాన్ని సాంప్రదాయ ప్రమాణాలకు భిన్నంగా రూపొందిస్తున్నారు. గ్రాడ్యుయేషన్ వారికి ఇది ఉత్తేజం కలిగించే సమయం. కానీ ఈ పరిస్థితులు అసమానమైన అనిశ్చితి, గందరగోళానికి దారితీస్తాయని భావిస్తున్నట్టు' సీజేఐ అభిప్రాయపడ్డారు. ఎదిగేందుకు, అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కోవడంలో యువతరానికి ఉన్న సామర్థ్యం నన్ను ఆశ్చర్యపరుస్తోంది. అయితే, కొంత సమయాన్ని వెచ్చించి, అవాస్తవమైన వాటికి లొంగకుండా, వైఫల్యాల నుంచి నేర్చుకోవాలని కోరుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. 

Tags:    

Similar News