Amar Preet Singh: ఐఏఎఫ్ చీఫ్‌గా అమర్ ప్రీత్ సింగ్.. ఈ నెల 30న బాధ్యతల స్వీకరణ

ఐఏఎఫ్ కొత్త చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ నియామకమయ్యారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ ఓ ప్రకటన విడుదల చేసింది.

Update: 2024-09-21 12:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) కొత్త చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ నియామకమయ్యారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఐఏఎఫ్ వైస్ చీఫ్‌గా ఉన్న ఆయన సెప్టెంబర్ 30న బాధ్యతలు చేపట్టనున్నారు. ఐఏఎఫ్ చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్న ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి త్వరలోనే పదవీ విరమణ చేయనున్నారు. దీంతో వివేక్ స్థానంలో ఐఏఎఫ్ చీఫ్‌గా అమర్ ప్రీత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, 1964 అక్టోబరు 27న జన్మించిన అమర్ ప్రీత్ సింగ్..1984 డిసెంబర్‌లో భారత వైమానిక దళంలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి ఆయన దాదాపు 40 సంవత్సరాల కెరీర్‌లో కమాండ్, స్టాఫ్, బోధనా, విదేశీ నియామకాలతో సహా అనేక కీలక పదవులను నిర్వహించారు.

అంతేగాక రోటరీ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 5 వేల గంటలకు పైగా ప్రయాణించిన అనుభవం ఉంది. వైస్ చీఫ్ కావడానికి ముందు అయన యుద్ధ స్క్వాడ్రన్‌, ఫ్రంట్‌లైన్ ఎయిర్ బేస్‌లకు కూడా నాయకత్వం వహించాడు. టెస్ట్ పైలట్‌గా, రష్యా రాజధాని మాస్కోలో మిగ్-29 అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ బృందానికి నాయకత్వం వహించాడు. నేషనల్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్‌లో ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఫ్లైట్ టెస్ట్)గా పనిచేశాడు. తేజస్ అనే తేలికపాటి యుద్ధ విమానం ఫ్లైట్ టెస్టింగ్‌కు బాధ్యత వహించాడు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఐఏఎఫ్ చీఫ్‌గా నియమించింది.


Similar News