పోటాపోటీగా ఎన్డీఏ, విపక్ష పార్టీల సమావేశాలు
లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో దేశంలోని రాజకీయ పార్టీలన్నీ రెండు గ్రూపులుగా మారుతున్నాయి.
దిశ, వెబ్ డెస్క్: లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో దేశంలోని రాజకీయ పార్టీలన్నీ రెండు గ్రూపులుగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన భూమిక పోషిస్తున్న విపక్షాల కూటమి పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. కూటమిలో ప్రస్తుతం ఉన్న పార్టీలను కాపాడుకుంటూనే కొత్త మిత్రుల కోసం ఈ రెండు గ్రూపులు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్డీఏ ఆధ్వర్యంలో ఈ నెల 18న ఢిల్లీలోని అశోకా హోటల్ లో మిత్రపక్షాల సమావేశం నిర్వహించునుంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షత వహించనున్నారు. మొత్తం 30 రాజకీయ పార్టీలు హాజరయ్యే ఈ సమావేశంలో త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాలు, భవిష్యత్ రాజకీయాల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.
కాగా NDAలో ప్రస్తుతం 24 పార్టీలు ఉన్నాయి. ఇందులో బీజేపీ, AIADMK, శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం), NPP (నేషనల్ పీపుల్స్ పార్టీ), NDPP (నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ), SKM (సిక్కిం క్రాంతికారి మోర్చా), JJP (జననాయక్ జనతా పార్టీ), IMKMK ( భారతీయ మక్కల్ కల్వి మున్నేట్ర కజ్గం), AJSU (ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్), RPI (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా), MNF (మిజో నేషనల్ ఫ్రంట్), TMC (తమిళ మనీలా కాంగ్రెస్), IPFT (త్రిపుర), BPP (బోడో పీపుల్స్ పార్టీ), PMK (పాటాలి మక్కల్ కచ్చి), MGP (మహాస్త్రవాది గోమంతక్ పార్టీ), అప్నా దళ్, AGP (అస్సాం గణ పరిషత్), రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ, నిషాద్ పార్టీ, UPPL (యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్), AIRNC (ఆల్ ఇండియా NR కాంగ్రెస్ పుదుచ్చేరి), శిరోమణి అక్దుచ్చేరి దాల్ సయుంక్త్ (ధింధ్సా), జనసేన (పవన్ కళ్యాణ్) ఉన్నాయి.
ఇక NCP (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గం), లోక్ జన్ శక్తి పార్టీ (రామ్ విలాస్), HAM (హిందూస్థానీ అవామ్ మోర్చా), RLSP (రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ), VIP (వికాశీల్ ఇన్సాన్ పార్టీ), మరియు SBSP (సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ) ఓం ప్రకాష్ రాజ్‌భర్) కొత్తగా ఎన్డీఏ కూటమిలో చేరనున్నారు. ఇక విపక్షాలకు సంబంధించిన సమావేశాన్ని ఈ నెల 17, 18 తేదీల్లో బెంగళూరులో నిర్వహిచనున్నారు. ఈ సమావేశంలో విపక్షాలకు చెందిన మొత్తం 24 పార్టీలు హాజరుకానున్నాయి. కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), ఎస్పీ, ఆప్, డీఎంకే, శివసేన తదితర పార్టీలు హాజరుకానుండగా.. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, బీహార్ సీఎం నితీశ్ కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.