బీజేపీ, కాంగ్రెస్ కు మేము దూరం!.. హాట్ టాపిక్ గా అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు
బీజేపీ, కాంగ్రెస్ కు తాము దూరం అంటూఅఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికలతో పాటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో పార్టీల మధ్య పొత్తులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలంటే విపక్షాలన్ని ఏకం కావాలంటూ పలువురు ప్రతిపక్ష నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న తరుణంలో సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఎస్పీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిమిత్తం కోల్ కతా వెళ్లిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తమ పార్టీ స్టాండ్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దురంగా ఉండటమే అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇక దేశంలో బీజేపీని ఓడించాలంటే ముందు యూపీలో బీజేపీని ఓడించాలని అన్నారు.
మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్ష పార్టీలను ఈడీ, సీబీఐ సంస్థల ద్వారా వేధిస్తోందని ఆరోపించిన అఖిలేష్ యాదవ్.. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనూ ఇదే చేసిందని ఆరోపించారు. యూపీతో పాటు దక్షిణ భారత దేశంలోనూ బీజేపీని ఓడించాలని తాము భావిస్తున్నామన్నారు. కాగా ఈనెల మొదటి వారంలో తమిళనాడు సీఎం స్టాలిన్ పుట్టిన రోజు వేడుకకు కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గేతో అఖిలేష్ యాదవ్ వేదికను పంచుకున్నారు. ఈ వేదికపై నుంచే రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు విపక్షాలు ఐక్యంగా ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఇంతలోనే తాము బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నామంటూ ఎస్పీ చీఫ్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
సౌత్ స్టేట్స్ కామెంట్స్ వెనుక కేసీఆర్ వ్యూహం?
అఖిలేష్ యాదవ్ చేసిన సౌత్ స్టేట్స్ వ్యాఖ్యల వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. కేసీఆర్ కూతురు కవితను ఇప్పటికే ఓసారి ప్రశ్నించిన ఈడీ మరోసారి విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపింది. ఈ పరిణామం బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారుతుందనే చర్చ జరుగుతోంది. దీంతో సాధ్యమైనంత మేరకు డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ఈడీని బద్నాం చేసే ప్రయత్నం కవిత చేస్తున్నారనే చర్చ ఇప్పటికే సోషల్ మీడియాలో జరుగుతోంది.
ఈ క్రమంలో తన మిత్రులైన అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి వారితో కేసీఆర్ కేంద్ర దర్యాప్తు సంస్థలపై పోరాటం తీవ్రతరం చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇవాళ సాయంత్రం అఖిలేష్ యాదవ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ తో అలయెన్స్ పై అఖిలేష్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ గా ఆసక్తిని రేపుతున్నాయి.