మోడీ కర్ణాటక సీఎం అవుతారా..?
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే తమ పార్టీతో పాటు దేశంలోని రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోతుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే తమ పార్టీతో పాటు దేశంలోని రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోతుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ప్రధాని తనను చూసి ఓటు వేయాలని కోరుతున్నారు. దీని బట్టి అన్ని రాష్ట్రాల రిమోట్ కంట్రోల్ మోడీ వద్ద ఉందని అర్థం అవుతున్నదని ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మండిపడ్డారు. మంగళవారం ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మోడీ పేరుతో ఎంత కాలం ఓట్లు అడుగుతారని బీజేపీపై ధ్వజమెత్తారు. కర్ణాటకలో మోడీ సీఎం, అమిత్ షా హోం మంత్రి అవుతారా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సమస్యలపై ఎన్నికల్లో మాట్లాడాలని హితవు పలికారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వమే ఉందని, ఇక్కడ ఉన్న 40 శాతం కమిషన్ ప్రభుత్వాన్ని మోడీ ఆమోదిస్తున్నారా అని ప్రశ్నించారు. కర్ణాటక నుంచి వచ్చిన వ్యక్తిగా ఈ ఎన్నికలు తనకు అత్యంత కీలకమైనవి అన్నారు. తాను కర్ణాటకలో 12 ఎన్నికల్లో పోటీ చేసి 11 సార్లు గెలిచానని ఇక్కడి ప్రజల పల్స్ తనకు తెలుసన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పక విజయం సాధించబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.