మరోసారి వార్తల్లో నిలిచిన చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ

ముంబైకి చెందిన చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ మరో కీలకనిర్ణయం తీసుకుంది. ఇటీవలే, కాలేజ్ క్యాంపస్‌ ఆవరణలో హిజాబ్‌ ధరించడాన్ని నిషేధిస్తూ వార్తల్లో నిలిచింది.

Update: 2024-07-03 05:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైకి చెందిన చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ మరో కీలకనిర్ణయం తీసుకుంది. ఇటీవలే, కాలేజ్ క్యాంపస్‌ ఆవరణలో హిజాబ్‌ ధరించడాన్ని నిషేధిస్తూ వార్తల్లో నిలిచింది. కాగా.. ఇప్పుడు టోర్న్ జీన్స్, టీషర్ట్స్, రిలీవింగ్ దుస్తులపై నిషేధం విధించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ముంబైలో ఈ సొసైటీ నిర్వహిస్తోన్న ఎన్‌జీ ఆచార్య , డీకే మరాఠే కళాశాలల్లో చిరిగిన జీన్స్‌, టీషర్టులు, జెర్సీలతో వస్తే విద్యార్థులను అనుమతించబోమని స్పష్టం చేసింది. విద్యార్థులు తప్పనిసరిగా ఫార్మల్‌, డీసెంట్‌ దుస్తుల్లో మాత్రమే రావాలని ఆదేశించింది.

కళాశాల గేటుకు నోటీసు

విద్యార్థులు క్యాంపస్‌లో ఉన్నప్పుడు ఫార్మల్, డీసెంట్ దుస్తులు ధరించాలని నోటీసును కళాశాల గేటుకు యాజమాన్యం పోస్టర్ అంటించింది. హాఫ్ షర్ట్ లేదా ఫుల్ షర్ట్ , ప్యాంటు ధరించవచ్చని.. అమ్మాయిలు భారతీయ లేదా పాశ్చాత్య దుస్తులను ధరించవచ్చని పేర్కొంది. విద్యార్థులు మతాన్ని లేదా సాంస్కృతిక అసమానతలను చూపించే ఎలాంటి దుస్తులూ ధరించవద్దని తెలిపింది. జీన్స్, టీషర్టులు, రివీలింగ్ డ్రెస్సులు, జెర్సీలు ధరించి వస్తే అనుమతించబోమని నోటీసుల్లో తెలిపింది. గతంలో హిజాబ్ విషయమై కొందరు బాంబే హైకోర్టుని ఆశ్రయించారు. అయితే, కాలేజ్ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది.


Similar News