Rahul Gandhi on adani: అదానీ అరెస్టు కాడు.. విచారణ జరగదని గ్యారెంటీ ఇస్తా- రాహుల్ గాంధీ
బిలియన్ డాలర్ల లంచం, మోసం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై (Gautam adani) కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విమర్శలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: బిలియన్ డాలర్ల లంచం, మోసం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై (Gautam adani) కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. అదానీని వెంటనే అరెస్టు చేయాలని(Rahul Gandhi on adani) డిమాండ్ చేశారు. ‘‘అదానీ అరెస్టు కాడని, ఆయనపై విచారణ జరగదని నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే ఆయన్ను నరేంద్ర మోడీ కాపాడుతున్నారు’’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికా, భారత చట్టాలను అదానీ ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు. మోడీ, అదానీల బంధం భారత్‌లో ఉన్నంత వరకే సురక్షితమన్నారు.
జేపీసీతో విచారణ జరపాలని..
ఇక, అదానీపై వచ్చిన ఆరోపణలపై వెంటనే సంయుక్త పార్లమెంటరీ కమిటీ(JPC)తో విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ అన్నారు. శీతకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. తన అవినీతి ద్వారా దేశ ఆస్తులన్నీ అదానీ కొల్లగొట్టారని ఆరోపించారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేసి విచారిస్తే విషయాలన్నీ బయటపడతాయన్నారు.సెబీ చీఫ్ మాధభి పురీ బచ్‌పైనా విచారణ జరిపించాలన్నారు. అదానీని రక్షిస్తున్న సెబీ చీఫ్‌ను ఆ పదవి నుంచి తొలగించి ఆమె పైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంబంధం లేకుండా విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ కోరారు.