Adani-Hindenburg Row: నిరాధారమైనవి.. హిండెన్ బర్గ్ ఆరోపణలను ఖండించిన అదానీ గ్రూప్

అదానీ గ్రూప్‌ (Adani Group)పై అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్ బర్గ్(Hindenburg) మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది.

Update: 2024-09-13 04:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అదానీ గ్రూప్‌ (Adani Group)పై అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్ బర్గ్(Hindenburg) మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ తో సంబంధం ఉన్న 310 మిలియన్ డాలర్ల(రూ.2,600కోట్లు) స్విస్ ఖాతాలను అక్కడి ప్రభుత్వం ఫ్రీజ్ చేసిందని ఆరోపించింది. అయితే, అదానీ గ్రూప్‌ ఆ ఆరోపణలను ఖండించింది. అవన్నీ నిరాధారమైనవని పేర్కొంది. కుట్రపూరితంగానే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని తెలిపింది. ‘‘ఆ నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం.. తిరస్కరిస్తున్నాం. అదానీ గ్రూప్‌ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి స్విస్‌ కోర్టు విచారణను ఎదుర్కోవడం లేదు. మా కంపెనీ ఖాతాలపై ఏ అధికారులు కూడా న్యాయపరమైన చర్యలు తీసుకోవట్లేదు. ‘గోథమ్ సిటీ’ స్టోరీలో పేర్కొన్న ఉత్తర్వుల్లోనూ మా గ్రూప్‌ కంపెనీల గురించి స్విస్‌ కోర్టు ప్రస్తావించలేదు. అంతేగాక, అకౌంట్లకు సంబంధించిన వివరణ ఇవ్వాలంటూ మాకు ఎలాంటి నోటీసులు రాలేదు. మా విదేశీ ఖాతాలు పారదర్శకంగా.. చట్టాలకు అనుగుణంగా మేం వాటిని నిర్వహిస్తున్నాం’’ అని అదానీ గ్రూప్‌ స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలు అసంబద్ధం, అహేతుకమైనవి అని అదానీ గ్రూప్‌ తమ ప్రకటనలో పేర్కొంది. తమ కంపెనీ ప్రతిష్ఠ, మార్కెట్‌ విలువపై కోలుకోలేని నష్టాన్ని కలిగించేందుకే కావాలని కుట్రపూరితంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది.

హిండెన్ బర్గ్ ఏమందంటే?

అదానీ గ్రూప్‌ (Adani Group)తో సంబంధముందని చెబుతున్న కంపెనీలపై చేపట్టిన మనీలాండరింగ్‌ దర్యాప్తులో భాగంగా, ఆరు స్విస్‌ ఖాతాల్లోని 310 మిలియన్‌ డాలర్ల (రూ.2,600 కోట్ల)కు పైగా నిధులను ఫ్రీజే చేసినట్లు స్విస్‌ వార్తా సంస్థ ‘గోథమ్‌ సిటీ’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ స్టోరీ లింక్ ని హిండెన్‌బర్గ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఫెడరల్ క్రిమినల్ కోర్ట్ (FCC) నుండి వచ్చిన ఉత్తర్వు ప్రకారం అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణలపై జెనీవా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం దర్యాప్తు చేస్తోందని తెలిపింది. బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌ (బీవీఐ), మారిషస్, బెర్ముడా వంటి పన్ను తక్కువగా ఉండే దేశాల్లోని ఆఫ్‌షోర్‌ ఫండ్‌లలో పలు ఆర్థిక అవకతవకలు జరిగాయని వెల్లడించింది. ఈ సంస్థలే 2021లో అదానీ షేర్లలో పెట్టుబడులు పెట్టాయని దర్యాప్తులో తేలిందని హిండెన్ బర్గ్ రాసుకొచ్చింది. ఆయా దేశాల్లోని ఫండ్‌లలో అదానీ గ్రూప్‌ ప్రతినిధి ఒకరు ఎలా పెట్టుబడులు పెట్టారన్నదీ, ఇటీవల విడుదలైన స్విస్‌ క్రిమినల్‌ కోర్టు రికార్డుల్లో ఉందని ఆరోపించింది. దీంతో, హిండెన్ బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ విరుచుకుపడింది.


Similar News