Mallikarjun Kharge: 'ఇది రాష్ట్రపతిని అవమానించడమే'.. బీజేపీపై మల్లికార్జున ఖర్గే ఫైర్

భారత కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడంపై బీజేపీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు.

Update: 2023-09-23 14:37 GMT

జైపూర్: భారత కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడంపై బీజేపీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ఈ కార్యక్రమానికి సినీ నటులను ఆహ్వానించిన బీజేపీ.. రాష్ట్రపతిని మాత్రం మినహాయించిందని మండిపడ్డారు. శనివారం రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడిన ఖర్గే.. ఇది రాష్ట్రపతిని అవమానించడమే అన్నారు. కాంగ్రెస్‌ అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తుందని.. బీజేపీ మాత్రం ఎవరినీ దగ్గరకు రానివ్వదని పేర్కొన్నారు. దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవిని కలిగిన ద్రౌపది ముర్ము విషయంలో బీజేపీ నిర్ణయం వెనుకున్న ఉద్దేశాలను ఆయన ప్రశ్నించారు.

గతంలో పార్లమెంట్ భవన శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ.. నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ అంటరాని వ్యక్తి కాబట్టే బీజేపీ ఆయనను ఆహ్వానించలేదని ఖర్గే ఆరోపించారు. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం వెనుక నరేంద్ర మోడీ ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని కూడా ఖర్గే ప్రశ్నించారు. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం అసలు బీజేపీకి ఇష్టం లేదన్నారు. కాగా.. మల్లికార్జున్ ఖర్గేతో పాటు అగ్ర నేత రాహుల్ గాంధీ శనివారం జైపూర్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన భవనానికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.


Similar News