మహారాష్ట్ర డిప్యూటీ సీఎంకు మద్దతుగా నిలిచిన బీజేపీ ఎంపీ
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)పై స్టాండప్ కమెడియన్ (stand-up comedian) కునాల్ కమ్రా (Kunal Kamra) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)పై స్టాండప్ కమెడియన్ (stand-up comedian) కునాల్ కమ్రా (Kunal Kamra) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కాగా.. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) తీవ్రంగా స్పందించారు. ముంబై యూనికాంటినెంటల్ హోటల్‌లోని హాబిటాట్ కామెడీ స్టూడియో కూల్చివేత చట్టబద్ధంగానే జరిగిందన్నారు. పార్లమెంట్ వెలుపల మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘2 నిమిషాల ఫేమ్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. మన సమాజం ఎక్కడికి వెళుతోంది..? మాట్లాడింది ఎవరైనా కావొచ్చు. కానీ, ఒకరిని అవమానించడం, వారి పరువుకు భంగం కలిగించేలా మాట్లాడటం సరైంది కాదు. గౌరవమే సర్వస్వం అని భావించే వ్యక్తిని మీరు కామెడీ పేరుతో అవమానిస్తున్నారు. జోక్స్ పేరుతో మన సంస్కృతిని, ప్రజలను దూషిస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించి ఆ వేదికను కూల్చడం చట్టబద్ధంగానే జరిగింది. కానీ, నా విషయంలో మాత్రం చట్టవిరుద్ధంగానే జరిగింది’ అని కంగనా వ్యాఖ్యానించారు.
ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మధ్య వివాదం
2020లో కంగనా రనౌత్, అప్పటి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మధ్య వివాదం నెలకొంది. మూవీ మాఫియా కంటే ముంబై పోలీసులంటేనే భయంగా ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇవి కాస్తా రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ క్రమంలో మహా ప్రభుత్వం, కంగన మధ్య కొన్ని రోజులపాటూ మాటల యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలోనే బాంద్రాలోని నటి కార్యాలయంలోని కొంత భాగాన్ని బీఎంసీ కూల్చివేసింది.