ఆ ఉగ్రవాది నిర్దోషి.. 1993 రైలు బాంబు పేలుళ్ల‌ కేసులో అబ్దుల్ కరీంకు ఊరట

Update: 2024-02-29 17:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ‘1993 వరుస రైలు పేలుళ్ల’ కేసులో ప్రధాన నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండా(80)ను రాజస్థాన్ అజ్మీర్‌లోని ‘ప్రత్యేక ఉగ్రవాద, విధ్వంసక కార్యకలాపాల నివారణ చట్టం’ (టాడా) కోర్టు గురువారం నిర్దోషిగా ప్రకటించింది. ప్రస్తుతం తుండా మరో కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. బాబ్రీ మసీదు కూల్చివేత మొదటి వార్షికోత్సవం సందర్భంగా లక్నో, కాన్పూర్, హైదరాబాద్, సూరత్, ముంబైలలో ఐదు రైళ్లలో జరిగిన వరుస పేలుళ్లలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన కేసులో తుండా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే, తగిన సాక్ష్యాధారాలు లేవని కోర్టు తాజాగా నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో తుండాతోపాటు అభియోగాలు ఎదుర్కొంటున్న మ‌రో ఇద్దరు నిందితులు ఇర్ఫాన్, అలియాస్ పప్పు (70), హమీదుద్దీన్ (44)లను మాత్రం ప్ర‌త్యేక కోర్టు దోషులుగా తేల్చింది. వారికి జీవిత ఖైదు శిక్ష ఖ‌రారు చేసింది. 1996 బాంబు పేలుళ్ల కేసులో ప్ర‌స్తుతం తుండా జీవిత ఖైదు అనుభ‌విస్తున్నాడు. కాగా, తుండాను నిర్దోషిగా ప్ర‌క‌టించ‌డాన్ని సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. తుండా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడు.


Tags:    

Similar News