AAP : ఏడు ఉచితాలు ప్రకటించిన ఆప్.. తీర్థయాత్రలకు ఆర్థికసాయం

దిశ, నేషనల్ బ్యూరో : ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Polls) కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఏడు ఉచిత హామీలను శుక్రవారం ప్రకటించారు.

Update: 2024-11-22 15:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Polls) కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఏడు ఉచిత హామీలను శుక్రవారం ప్రకటించారు. ఉచితంగా విద్యుత్, నీరు, విద్య, మొహల్లా క్లినిక్‌లలో చికిత్స, మహిళలకు బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. వయోవృద్ధుల తీర్థయాత్రలకు ఆర్థికసాయం, ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళకు ప్రతినెలా రూ.1,000 అందిస్తామన్నారు. ఈ ఉచితాలను కేజ్రీవాల్ ‘రేవ్డీ’లుగా అభివర్ణించారు. రేవ్డీలు అంటే.. బెల్లం పాకం, నువ్వులు కలిపి తయారు చేసే ముద్దలు. గత ఎన్నికల్లో ఆప్ ఇచ్చిన హామీలపై బీజేపీ విమర్శలు గుప్పిస్తూ.. వాటిని ‘రేవ్డీ’లతో పోల్చింది. దీంతో అదే పదం (రేవ్డీ)తో ఉచితాలపై ఎన్నికల ప్రచారానికి అరవింద్ కేజ్రీవాల్ శ్రీకారం చుట్టారు. ‘రేవ్డీ పర్ చర్చ’ ప్రచార కార్యక్రమాన్ని ఆప్‌కు చెందిన జిల్లా, బూత్ స్థాయి కార్యకర్తలు 65వేల సమావేశాలు, కరపత్రాల పంపిణీ ద్వారా జనంలోకి తీసుకెళ్తాయని ఆయన వెల్లడించారు.

ఉచిత హామీలు ఇచ్చే ఆలోచనే బీజేపీకి లేదు

దాదాపు 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా.. ఒక్క రాష్ట్రంలో కూడా ఇలాంటి రేవ్డీలను(ఉచితాలు) అమలు చేయడం లేదని కేజ్రీవాల్ విమర్శించారు. ఉచిత హామీలు ఇచ్చే ఆలోచనే బీజేపీకి లేదన్నారు. ‘‘ఢిల్లీపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎన్ని అధికారాలు ఉన్నాయో.. అన్నే బాధ్యతలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడి ప్రజల బాగు కోసం కేంద్ర సర్కారు ఏమీ చేయడం లేదు’’ అని కేజ్రీవాల్ ఆరోపించారు. గత పదేళ్లలో ఢిల్లీకి బీజేపీ ఏం చేసిందో ఓటర్లను అడగాలని ఆప్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో కేంద్రమంత్రులు అమిత్‌షా, హర్దీప్ పురి ఢిల్లీలోని పూర్వాంచలీ వర్గం వారికి బూటకపు హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. ఢిల్లీలోని ప్రభుత్వ గుర్తింపు లేని కాలనీలకు రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పిన కేంద్రమంత్రులు.. గత ఐదేళ్లలో ఒక్క కాలనీకి కూడా ఆ సాయాన్ని చేయలేదని కేజ్రీవాల్ తెలిపారు.

Tags:    

Similar News