కేజ్రీవాల్ చిత్ర హింసలకు తలొగ్గరు: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చిత్ర హింసలకు తలొగ్గరని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ నొక్కిచెప్పారు. కేజ్రీవాల్‌ను బీజేపీ భావోద్వేగంతో విడగొట్టాలని చూస్తోందని కానీ అది కుదరదని స్పష్టం చేశారు.

Update: 2024-04-10 10:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చిత్ర హింసలకు తలొగ్గరని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ నొక్కిచెప్పారు. కేజ్రీవాల్‌ను బీజేపీ భావోద్వేగంతో విడగొట్టాలని చూస్తోందని కానీ అది కుదరదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తిహార్ జైలును గ్యాస్ చాంబర్స్‌గా మార్చాలని బీజేపీ భావిస్తోందా అని ప్రశ్నించారు. ‘ప్రజల ద్వారా ఎన్నికైన ముఖ్యమంత్రిని జైలులో ఉంచాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. రెండు రోజుల క్రితం కేజ్రీవాల్ తన లాయర్లను కలిశారు. ఆ సమావేశంలో ఆప్ ఎమ్మెల్యేలు తమ ప్రాంతాలకు వెళ్లి సమస్యలు పరిష్కరించాలని సందేశం ఇచ్చారు. దీని ఆధారంగానే ఆయనపై విచారణ చేపట్టి.. కుటుంబ సభ్యులను, న్యాయవాదులను కలవకుండా ఆపేస్తామని జైలు అధికారులు బెదిరిస్తున్నారు’ అని ఆరోపించారు.

కేజ్రీవాల్‌ను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌ను బీజేపీ తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని..కానీ ఆ ప్రయత్నాలు ఫలించవని తెలిపారు. కేజ్రీవాల్ రాజీనామా చేస్తే త్వరలో బీజేపీయేతర ముఖ్యమంత్రులు జైలు పాలవుతారని చెప్పారు. కాగా, లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ అరెస్టైన విషయం తెలిసిందే. అయితే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా..నేరం రుజువు కానందున జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆప్ వాదిస్తోంది. మరోవైపు కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. 

Tags:    

Similar News