భర్తని 7 సార్లు అరెస్టు చేయించింది.. మళ్లీ తానే బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చింది

వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం. అయితే వాళ్ల మధ్య ఒక్కోసారి గొడవలు తారాస్థాయికి చేరి విడాకుల వరకు వెళ్తుంటాయి.

Update: 2023-07-12 10:26 GMT

దిశ, వెబ్ డెస్క్: వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం. అయితే వాళ్ల మధ్య ఒక్కోసారి గొడవలు తారాస్థాయికి చేరి విడాకుల వరకు వెళ్తుంటాయి. కొంతమంది భార్యలు తమ భర్తలకు బుద్ధి చెప్పించడానికి ఒక్కోసారి పోలీస్ కేసు కూడా పెడుతుంటారు. కానీ అన్ని ఆలోచించుకొని కేసు వాపస్ తీసుకుంటుంటారు. కానీ గుజరాత్ లోని ఓ మహిళ తనకు పెళ్లైన 10 ఏళ్లలో భర్తపై ఏడుసార్లు కేసు పెట్టి జైలుకు పంపింది. విచిత్రంగా ఈ ఏడుసార్లు భర్తను ఆమెనే దగ్గరుండి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చింది. అసలు ఆమె ఎందుకు అలా చేసిందంటే?.. గుజరాత్ లోని మెహసానా జిల్లాలోని కడి టౌన్ కు చెందిన ప్రేమ్ చంద్ కు సోనూ అనే యువతితో 2001లో వివాహం జరిగింది. 2014 వరకు వాళ్ల కాపురం సజావుగానే జరిగింది. కానీ ఆ ఏడాది భర్త తనను కొట్టాడని భార్య సోనూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రేమ్ చంద్ ను జైలుకు పంపారు. అనంతరం భర్తకు దూరంగా ఉంటున్న సోనూకు నెలకు రూ.2 వేలు భరణంగా చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.

అయితే రోజూవారి కూలీ అయిన ప్రేమ్ చంద్ నెలనెలా భార్యకు రూ.2 వేలు చెల్లించలేకపోయాడు. దీంతో భార్య ఫిర్యాదు మేరకు భర్తను జైలులో వేయగా.. 5 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. కాగా భార్య సోనూ లాయర్ తో మాట్లాడి భర్తకు మొదటిసారి బెయిల్ ఇప్పించింది. అనంతరం ఇద్దరూ విడివిడిగా ఉన్నప్పటికీ ఫోన్ లో మాట్లాడుకుంటున్న సందర్భంగా ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో సోనూ భర్తపై మళ్లీ కేసు పెట్టింది. ఇలా భార్యతో గొడవ పడటం, సరిగ్గా భరణం చెల్లించకపోవడంతో 2016 నుంచి 2020 వరకు ప్రతి ఏడాది భర్తపై కేసు పెట్టి జైలుకు పంపింది సోనూ. తిరిగి ప్రతిసారి ఆమె దగ్గరుండి భర్తకు బెయిల్ ఇప్పించింది. తాజాగా భార్యాభర్తలు కలిసుంటున్న నేపథ్యంలో తన పర్సు, ఫోన్ పోయిందని ప్రేమ్ చంద్ తన భార్య సోనూ, కొడుకుపై ఫిర్యాదు చేయగా.. భార్య తనను కొట్టాడంటూ భర్తపై కేసు పెట్టింది. 

Tags:    

Similar News