బెంగాల్ రైలు ప్రమాదంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య.. పలు రైళ్లు దారి మళ్లింపు
పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. సుమారు 25 మందికిపైగా గాయపడ్డారు.
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. సుమారు 25 మందికిపైగా గాయపడ్డారు. అసోంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సెల్దాకు కంచన్ జంగా ఎక్స్ ప్రెస్ వెళ్తుంది. కాగా.. న్యూజల్ పాయ్ గుడి జంక్షన్ సమీపంలోని రంగపాని స్టేషన్ దగ్గర.. ట్రాక్ పై వెనుకనుంచి వచ్చిన గూడ్స్ రైలుని బలంగా ఢీకొంది. దీంతో కాంచన్ జంగా రైలుకు చెందిన బోగీ గాల్లోకి లేచింది. ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
పలు రైళ్లు దారి మళ్లింపు..
రైలు ప్రమాదం వల్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ రూట్‌లో వెళ్లే పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. మరికొన్నింటిని రద్దు చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పాట్ కి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతాధికారుతో మాట్లాడానని.. వారు పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. రైల్వేమంత్రి ఘటనాస్థలికి వెళ్తారని తెలిపారు. ఎన్ఎఫ్ఆర్ జోన్ లో జరిగిన ప్రమాదం దురృష్టకరం అని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. రైల్వే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు.