బిహార్ లో ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న గంగానది

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు వస్తున్నాయి. దీంతో ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.

Update: 2024-08-28 08:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు వస్తున్నాయి. దీంతో ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. బిహార్‌ లో గంగా నది ప్రమాదస్థాయిలో ప్రవహిస్తుంది. నదిలో నీటిమట్టం భారీగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాట్నాలోని పలు పాఠశాలలను అధికారులు మూసివేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని సుమారు 76 ప్రభుత్వ పాఠశాలను ఆగస్టు 31 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ‘గంగా నదిలో నీటి మట్టం పెరుగుతున్న దృష్ట్యా పాట్నా జిల్లాలోని ఎనిమిది బ్లాకుల్లో మొత్తం 76 ప్రభుత్వ పాఠశాలలను ఆగస్టు 31 వరకూ మూసివేస్తున్నాం’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మేజిస్ట్రేట్ లకు ప్రత్యేక అధికారాలు

బిహార్ ప్రభుత్వం ఇటీవలే జిల్లా మేజిస్ట్రేట్‌లకు ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. వరదల వంటి పరిస్థితి ఏర్పడితే పాఠశాలల మూసివేతపై నిర్ణయం తీసుకోవచ్చంది. ఇటీవలే పాట్నా సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు గంగా నది వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. దీంతో, అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యగా సెలవులు ప్రకటించారు.


Similar News