Japan: భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత

జపాన్‌(Japan)ను భారీ భూకంపం (earthquake) భయపెట్టింది. దక్షిణ తీర ప్రాంతంలో క్యుషు ద్వీపం సమీపంలో భూమి కంపించింది.

Update: 2024-08-08 10:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జపాన్‌(Japan)ను భారీ భూకంపం (earthquake) భయపెట్టింది. దక్షిణ తీర ప్రాంతంలో క్యుషు ద్వీపం సమీపంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై దాని తీవ్రత 7.1గా నమోదైందని జపాన్‌ వాతావరణ సంస్థ పేర్కొంది. 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని వెల్లడించింది. అంతే కాకుండా అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. భూకంపకేంద్రం సమీపంలోని విమానాశ్రయం అద్దాలు దెబ్బతిన్నాయని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. క్యుషు ద్వీపంలోని నిచినాన్‌, మియాజాకి సమీపంలోని కొన్ని ప్రాంతాలపై భూకంపం ప్రభావం ఎక్కువగా కనిపించింది. 1.6 అడుగుల ఎత్తులో అలలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. నష్ట తీవ్రతను అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభావిత ప్రాంత ప్రజలు తీరానికి దూరంగా ఉండాలని సూచించారు. అలాగే క్యుషు, షికోకు ప్రాంతంలోని న్యూక్లియర్ రియాక్టర్లు సురక్షితంగానే ఉన్నాయని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ ప్రకటించింది. 2011లో సంభవించిన భూకంపం, సునామితో పుకుషిమా అణుకేంద్రం దెబ్బతింది. అప్పటి నుంచి ప్రకృతి ప్రకోపించినప్పుడల్లా ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ భద్రతపై ఆందోళన నెలకొంటుంది. ఇదిలా ఉంటే.. భూకంపంతోపాటు, సునామీ వస్తే టోక్యో సిటీలోకి భారీగా నీరు వస్తుంది. నీటిని మళ్లించేందుకు నగర శివారులో పెద్ద టన్నెల్స్‌ను ఏర్పాటు చేశారు. 


Similar News