ఎల్‌ఓసీ వెంబడి చొరబాటుకు సిద్ధంగా 70 మంది ఉగ్రవాదులు: జమ్మూకశ్మీర్ డీజీపీ

భారత్‌లోకి అక్రమంగా అడుగుపెట్టి దేశంలో విధ్వంసం సృష్టించడానికి, దాడులు చేయడానికి నియంత్రణ రేఖ వద్ద 60-70 మంది ఉగ్రవాదులు

Update: 2024-06-02 08:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లోకి అక్రమంగా అడుగుపెట్టి దేశంలో విధ్వంసం సృష్టించడానికి, దాడులు చేయడానికి నియంత్రణ రేఖ వద్ద 60-70 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని సమాచారం అందిందని జమ్మూకశ్మీర్ డీజీపీ రష్మీ రంజన్ స్వైన్ తాజాగా చెప్పారు. వారంతా కూడా ఐదు లేదా ఆరు బృందాలుగా ఏర్పడి వేరు వేరు చోట్ల దాడుల చేయడానికి చాలా కాలంగా ప్రణాళికలు రచిస్తున్నారని, ఏ సమయంలోనైనా వారు ఎల్‌ఓసి దాటి దాడులు చేసే అవకాశం ఉందని తెలిపారు.

పాకిస్తాన్‌‌లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అయినప్పటికి కూడా ఆ దేశం జమ్మూకశ్మీర్‌కు మనుషులు, డ్రోన్లు వంటి వస్తువులను పంపడం ఆపడం లేదు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు, నగదు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు డ్రోన్లు వంటివి తరుచుగా పాక్ నుంచి భారత్ సరిహద్దు గ్రామాల్లోకి వస్తున్నాయి. వీటిన్నింటిని మన సైన్యం అడ్డుకుంటుందని, ఉగ్రవాదులపై భారత భద్రతా సిబ్బంది విజయం సాధించడానికి ఖచ్చితంగా కష్టపడతారని డీజీపీ చెప్పారు. ఇంతకుముందు మే 27న కుప్వారాలో భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, దాడులకు ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.


Similar News