Maharashtra: మహారాష్ట్రలో ఏడుగురు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

మహారాష్ట్రలో ఎమ్మెల్సీల నియాకమం వివాదాస్పదంగా మారింది. కోర్టు తీర్పు పెండింగ్ లో ఉండగానే ఏడుగురు ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు.

Update: 2024-10-15 08:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో ఎమ్మెల్సీల నియాకమం వివాదాస్పదంగా మారింది. కోర్టు తీర్పు పెండింగ్ లో ఉండగానే మహారాష్ట్రలో ఏడుగురు ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. వారితో మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ డాక్టర్ నీలం గోర్హే ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ కోటా నుంచి మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఏడుగురు నేతల నామినేషన్లపై సోమవారం అర్థరాత్రి షిండే సర్కారు గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏడుగురిలో ముగ్గురు బీజేపీకి చెందినవారు కాగా... ఇద్దరు ఏక్‌నాథ్ షిండే శివసేనకు చెందిన వారు కాగా.. మరొకరు అజిత్ పవార్ వర్గానికి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఉన్నారు. ఇకపోతే, నామినేటెడ్ సభ్యులకు ఆరేళ్ల పదవీకాలం ఉంటుంది.

బాంబే హైకోర్టులో తీర్పు రిజర్వ్

ఇకపోతే, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గం 12 మంది నామినేటెడ్ ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ ఆమోదం కోరుతూ జాబితాను పంపింది. 2022లో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీ అధికారంలోకి రాగానే ఆ జాబితాను ఉపసంహరించుకున్నారు. దీనిపై అప్పటి వరకు గవర్నర్ నామినేటెడ్ పదవులపై నిర్ణయం తీసుకోలేదు. ఠాక్రే ప్రభుత్వం పంపిన జాబితాలో గవర్నర్‌కు స్థానం ఉండదని గతంలో హైకోర్టు పేర్కొంది. దీంతో, జాబితా ఉపసంహరణను సవాలు చేస్తూ శివసేన (యూబీటీ) నాయకుడు సునీల్ మోడీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై బాంబే హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అయినప్పటికీ ఏడుగురిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ మహారాష్ట్ర సర్కారు ముందుకెళ్లింది. కాగా.. ఈ విషయాన్ని మంగళవారం సునీల్ మోడీ తరఫు న్యాయవాది శ్రీఖండే కోర్టుని ఆశ్రయించారు. రాష్ట్రంలో ఏడుగురు ఎమ్మెల్సీల నియామకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాగా.. దీనిపై అడ్వొకేట్ జనరల్ డాక్టర్ బీరేంద్ర సరాఫ్ స్పందిస్తూ నియామకాలపై ఎలాంటి స్టే లేదని పేర్కొన్నారు. ముందస్తు నోటీసు ఇవ్వలేదని పేర్కొంటూ కోర్టులో సమస్యను లేవనెత్తిన తీరుపై ఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచినందున తాను విచారణను కోరడం లేదని, కేవలం వాస్తవాలను రికార్డులో ఉంచుతున్నానని సునీల్ మోడీ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. దీంతో, ధర్మాసనం శ్రీఖండే వాదనలు అంగీకరించి వివరాలు నమోదు చేసింది.


Similar News