Nepal helicopter crash: ఎవరెస్ట్ సమీపంలో హెలికాప్టర్ అదృశ్యం.. ఆరుగురి మృతి

నేపాల్‌లోని ఎవరెస్ట్ పర్వతం సమీపంలో మంగళవారం హెలికాప్టర్ ప్రమాదం జరిగింది.

Update: 2023-07-11 12:55 GMT

ఖాట్మండు: నేపాల్‌లోని ఎవరెస్ట్ పర్వతం సమీపంలో మంగళవారం హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. సోలుఖున్‌వు జిల్లాలోని లామ్ జురా గ్రామంలో స్థానికులు హెలికాప్టర్ శిథిలాలను గుర్తించారు. ముక్కలుగా విరిగిన ఈ ప్రైవేట్ కమర్షియల్ హెలికాప్టర్‌లో ఐదుగురు మెక్సికన్లు సహా ఆరు మృతదేహాలను భద్రతా సిబ్బంది కనుగొన్నారు. ఎత్తయిన పర్వత శిఖరాలకు నిలయమైన సోలుఖున్‌వు జిల్లాలోని సుర్కే నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరిన ఈ చాపర్ ప్రతికూల వాతావరణం కారణంగా 15 నిమిషాల్లో కంట్రోలింగ్‌తో సంబంధాలు కోల్పోయింది.

ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు నేపాల్ ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. 1998 నుంచి విమానాలు నడపడంలో నిష్ణాతుడైన కెప్టెన్ చెట్ బహదూర్ గురుంగ్ మృతి చెందిన ప్రయాణికుల్లో ఉన్నారు. ఈయన మనంగ్ ఎయిర్‌లో దశాబ్ద కాలంగా పని చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతం ఎవరెస్ట్‌తో సహా దేశంలోని ఎత్తయిన శిఖరాలను చూడాలనుకునే పర్యాటకులను రవాణా చేసే మనంగ్ ఎయిర్ సంస్థ హెలికాప్టర్ ను నడుపుతోంది.


Similar News