Drugs: బెంగళూరు ఎయిర్ పోర్టులో భారీ డ్రగ్స్ పట్టివేత
బెంగళూరు ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.75 కోట్ల విలువైన 37 కిలోల మాదకద్రవ్యాలతో ఇద్దరు నైజీరియన్ మహిళలను అరెస్టు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరు ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.75 కోట్ల విలువైన 37 కిలోల మాదకద్రవ్యాలతో ఇద్దరు నైజీరియన్ మహిళలను అరెస్టు చేశారు. ఇది కర్ణాటకలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డ్రగ్స్ స్మగ్లింగ్ అని పోలీసులు తెలిపారు. బాంబా ఫాంటా (31), అబిగైల్ అడోనిస్ (30) అనే ఇద్దరు మహిళలు తమ ట్రాలీ బ్యాగుల్లో డ్రగ్స్ ని గుర్తించారు. ఢిల్లీ నుండి బెంగళూరుకి వచ్చినట్లు తెలిపారు. ఎయిర్ పోర్టులో వారిద్దరు దిగినప్పుడు అరెస్టు చేసినట్లు మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు. వారి నుండి నాలుగు మొబైల్ ఫోన్లు, పాస్‌పోర్ట్‌లు, రూ.18,000 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. వారు ఢిల్లీలో నివసిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా అక్రమ రవాణాలో పాల్గొన్నారు. వారు డ్రగ్స్ రవాణా చేయడానికి విమాన మార్గాలను ఉపయోగించారన్నారు. గత సంవత్సరంలో ముంబైకి 37 సార్లు, బెంగళూరుకు 22 సార్లు ప్రయాణం చేశారని తెలిపారు.
2016 నుంచే భారత్ లో..
2020 లో నిందితురాలు ఫాంటా బిజినెస్ వీసాపై భారతదేశానికి రాగా.. మరో నిందితురాలు అడోనిస్... 2016 నుండి దేశంలోనే ఉంటున్నారని సీపీ అనుపమ్ అగర్వాల్ తెలిపారు. ఈ ఇద్దరు మహిళలు గత రెండేళ్లుగా డ్రగ్స్ స్మిగ్లింగ్ పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. ఆరు నెలల క్రితం మంగళూరులో హైదర్ అలీ అనే వ్యక్తిని 15 గ్రాముల డ్రగ్స్ తో పట్టుకున్నప్పుడే ఈ ఆపరేషన్ ప్రారంభమైందన్నారు. ఆ తర్వాత 6 కిలోల డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్ జాతీయుడు పీటర్ ని బెంగళూరులో అరెస్టు చేశారు. దీంతో, ఈ డ్రగ్స్ రాకెట్ ని ఛేదించినట్లు వెల్లడించారు.