సీఏఏ కింద 8 మంది మాత్రమే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు: అస్సాం సీఎం

సీఏఏ వ్యతిరేక నిరసనకారులు ప్రజలను ఎలా భయపెట్టడానికి ప్రయత్నించారో ఈ దరఖాస్తులే సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Update: 2024-07-15 14:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలైన నాలుగు నెలల కాలంలో కేవలం ఎనిమిది మంది మాత్రమే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోమవారం తెలిపారు. సవరించిన చట్టం ప్రకారం 50 లక్షల మంది అక్రమ వలసదారులు పౌరసత్వం పొందవచ్చని భావించాం. అయితే సీఏఏ వ్యతిరేక నిరసనకారులు ప్రజలను ఎలా భయపెట్టడానికి ప్రయత్నించారో ఈ దరఖాస్తులే సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 'సీఏఏ కింద పౌరసత్వం కోసం 8 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కూడా ఇద్దరు మాత్రమే ఇంటర్వ్యూకు వచ్చారని ' హిమంత బిశ్వ శర్మ విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ సందర్భంగా అస్సాంలోని ఫారినర్స్ ట్రిబ్యునల్స్‌లోని కేసులను ఉపసంహరించుకుంటారా అని అడిగిన ప్రశ్నకు.. కొన్ని నెలల పాటు వాయిదా వేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. 2015 కంటే ముందు భారత్‌కు వచ్చిన ఎవరైనా(సీఏఏ ప్రకారం) పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు మొదటి హక్కు ఉంటుంది. చేసుకోకపోతే వారిపై కేసు నమోదవుతుంది. కాబట్టి ఇది చట్టబద్ధమైన సూచనగా భావించాలి. అలాగే, 2015 తర్వాత ఎవరు వచ్చినా వారిని బహిష్కరిస్తామని ఆయన వివరించారు. ఫారినర్ ట్రిబ్యునల్స్‌లో హిందూ బెంగాలీలపై కేసులు ఎత్తివేస్తున్నట్టు తప్పుదోవ పట్టించే నివేదికలను ఆయన ఖండించారు. మేము ఏ కేసును ఉపసంహరించుకోలేం. దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.  


Similar News